రైతులకు సంకెళ్లు వేయడంపై ఎస్పీ సీరియస్, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు సస్పెండ్

Shackles for AP farmers : గుంటూరు జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై రూరల్ ఎస్పీ విశాల్ గున్ని సీరియస్ అయ్యారు. ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఆర్ ఎస్‌ఐ, ఆర్‌ఐలకు మెమోలు జారీ చేశారు. ఘటనపై అదనపు ఎస్పీతో విచారణకు ఆదేశించారు.
రాజధాని నిరసనల్లో పాల్గొన్న రైతుల చేతులకు బేడీలు వేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రానికి అన్నంపెట్టే రైతుకు సంకెళ్లువేయడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అన్నదాతల పట్ల ప్రభుత్వం ఇలాగేనా వ్యవహరించేందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులపట్ల తీరు మారకుంటే…ఈ ప్రభుత్వానికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నారు.
మూడు రాధానులకు మద్ధతుగా నిన్న ఉద్దండరాయుని పాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. వారికి సంఘీభావం తెలిపేందుకు మరికొంత మంది రైతులు వెళ్తుండగా… క్రిష్ణాయపాలేనికి చెందిన కొంతమంది రైతులు వారిని అడ్డుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించే క్రమంలో రైతుల చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. ఆతర్వాత నరసరావుపేట సబ్ జైలుకు తరలించారు.