వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా.. జగన్‌కు లేఖ

Sidda Raghava Rao: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు తన రాజీనామా లేఖను పంపారు.

వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో తన రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తానని శిద్దా రాఘవరావు తెలిపారు.

కాగా, శిద్దా రాఘవరావుది ప్రకాశం జిల్లా. వ్యాపారవేత్తగానూ ఆయన రాణించారు. టీడీపీ నుంచి 2014లో పోటీచేసి శిద్దా రాఘవరావు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో ఆయన అటవీ శాఖతో పాటు పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రిగా చేశారు.

ప్రకాశం జిల్లా దర్శి నుంచి 2014లో పోటీ చేసిన ఆయన గెలిచారు. 2019 ఎన్నికల్లో దర్శి నియోజక వర్గం నుంచి వైసీపీ నుంచి పోటీచేసి మద్దిశెట్టి వేణుగోపాల్ గెలిచారు. 2019లో శిద్దా రాఘవరావు ఒంగోలు అసెంబ్లీ నుంచి కాకుండా ఎంపీగా పోటీ చేశారు.

అప్పట్లో వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో దర్శి నియోజక వర్గం నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, శిద్దా రాఘవరావు 2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గానూ నియమితుడయ్యాడు.

Also Read: నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జిల‌ను నియమించిన బీజేపీ.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు