పెద్దల నుంచి గల్లీ లీడర్ల వరకు అందరి చిట్టా సిద్ధమైందా? విశాఖ నుంచి అనంత దాకా అన్ని అక్రమాలపై సిట్ దర్యాప్తు

రుషికొండ విధ్వంసం, గుడివాడ క్యాసినో, కాకినాడలో బియ్యం దందా, గోదావరి జిల్లాల్లో భూఆక్రమణ, గుంటూరులో ఆగడాలు..ఇలా క్రైమ్ ఫైల్స్ గోదాములే నిండిపోతున్నాయట.

గత ఐదేళ్ల పాలన నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అట. ఇంతకముందు ఎప్పుడూ చూడలే. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ ఎవరూ అట్ల చేయలేరేమో అన్నట్లుగా అరాచకం జరిగిందట. చెప్పుకుంటూ పోతే ఇంకో ఐదేళ్లు అయినా క్రైమ్‌ ఫైల్స్ క్లైమాక్స్‌కు రావట. అలా..ఇలా కాదు అడ్డగోలు వ్యవహారం ఓ రేంజ్‌లో జరిగిందంటున్నారు. లెక్కలేని పనులు, బాధ్యత మరిచి వ్యవహరించిన తీరుకు అంతే లేదట.

సినిమా తీసినా..వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించినా అయిపోనంత..క్రైమ్ కహాని ఉందట. నడిపించే నాయకుల నుంచి కిందిస్థాయి లీడర్ల వరకు అందిరిదీ అదే దారట. ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జా పెట్టేశారట. అప్పటి ఆక్రమణలు, సెటిల్‌మెంట్లు, వసూళ్ల మ్యాటరేంటో తేల్చేందుకు ప్రత్యేక టీమ్‌లు రెండు నెలల నుంచి ఫీల్డ్‌లో పనిచేస్తున్నాయట.

ఫైల్స్‌ రెడీ చేస్తున్నారా?
ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డూఅదుపు లేకుండా కబ్జాలు, సెటిల్‌మెంట్లు, వసూళ్ల దందా నడిచిందంటున్నారు కూటమి నేతలు. తాడేపల్లిలో మకాం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు అందరి అరాచకాల ఫైల్స్‌ రెడీ చేస్తున్నామని అంటున్నారు. సిట్‌ దర్యాప్తు మొదలుపెట్టి..అందరికీ లెక్క పెట్టి మరీ వడ్డీతో సహా గట్టిగానే ఇచ్చి పడేస్తామని అంటున్నారు.

గన్‌ చూపించి ఆస్తులు రాయించుకున్నారన్న ఆరోపణల నుంచి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జాలు, దందాలు చేసిన కిందిస్థాయి నేతల వరకు అందరి లెక్కలు తీస్తున్నామంటోంది ప్రభుత్వం. ఎంత విధ్వంసం జరిగిందో త్వరలోనే ప్రజల ముందు వాస్తవాలను పెడుతామంటున్నారు లీడర్లు.

ఐదేళ్లలో జరిగిన అక్రమాలు, ఆక్రమణల గుట్టు రట్టు చేసేందుకు..సీఎం ఆదేశాలతో రెండు నెలల కిందటే విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లి..ఇతర విభాగాల అధికారులతో కలిసి..కబ్జాలు, దందాల లెక్కలపై విజిలెన్స్‌ సిబ్బంది ఆరా తీశారట. రెండు నెలల పాటు ఫీల్డ్ వర్క్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్‌ డిటేయిల్ దర్యాప్తు కోసం సిట్‌ను నియమించి బాధితులకు న్యాయం చేయాలని భావిస్తోందట ప్రభుత్వం.

అధికార అండతో మాఫియా తరహా డీల్స్‌ జరిగాయట. రాష్ట్రస్థాయిలో గనులు, పోర్టులు, డిస్టిలరీలు, సెజ్‌లు, హోటళ్లు, రిసార్టులు..ఇలా ఒక్కటేమిటి..ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ అడుగు పెట్టి..అసలు వాటాదారులను, యజమానులను తరిమేశారన్న ఆరోపణలున్నాయి. ఇక జిల్లాస్థాయిలో కూడా ఎక్కడికక్కడ వైసీపీ నేతలు తమ అనుచరగణంతో చెలరేగిపోయారట. భూకబ్జాలు, దందాలతో జనాలను హింసించారట.

వేల సంఖ్యలో ఫిర్యాదుదారులు
కూటమి ప్రభుత్వానికి వందలూ, వేల సంఖ్యలో ఫిర్యాదుదారులు రావడంతో ఆరా తీస్తే ఒక్కో దారుణం బయటపడుతోందట. అప్పటి బాధితులందరికీ ఇప్పుడు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారట. వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి..బాధితులకు న్యాయం చేయడంతో పాటు..కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేసిన వాళ్లను వదిలిపెట్టొద్దని ఆర్డర్స్ ఇచ్చేశారట. విశాఖలో ప్రైవేటు భూముల ఆక్రమణ నుంచి అనంతపురంలో కియాకు బెదిరింపుల దాకా..చాలా అంశాలు విజిలెన్స్‌ రిపోర్టులో ఉన్నట్లు చెబుతున్నారు.

రుషికొండ విధ్వంసం, గుడివాడ క్యాసినో, కాకినాడలో బియ్యం దందా, గోదావరి జిల్లాల్లో భూఆక్రమణ, గుంటూరులో ఆగడాలు..ఇలా క్రైమ్ ఫైల్స్ గోదాములే నిండిపోతున్నాయట. గ్రామస్థాయి భూకబ్జాల నుంచి రాష్ట్రస్థాయిలో జరిగిన అరాచకాలు..దందాల తీరు, తీవ్రత చూసి ఉన్నతాధికారులే షాక్ అయినట్లు తెలుస్తోంది. కళ్లుతిరిగేలా సాగిన ఈ క్రైమ్‌పై సినిమా తీస్తే పది స్వీక్వెల్‌లూ కూడా సరిపోవనట. సీరియల్‌ తీయాలంటే వందల ఎపిసోడ్లు కావాలని, వెబ్‌ సిరీస్‌ అయితే ఎన్ని సీజన్లు తీసినా అరాచకం ఫైల్స్‌ మాత్రం కొలిక్కిరాదంటున్నారు. సిట్‌ దర్యాప్తు స్టార్ట్ చేసి ఒక్కో జిల్లాలో ఒక్కో నేత వ్యవహారం ఏంటో త్వరలోనే బయటపెట్టబోతున్నారట.

Malakpet Metro Station : హైదరాబాద్ మలక్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బైకులు