Software Engineer Complaints , Against Husband
software engineer complaints anantapur sp , against husband abducted her child : పెళ్లైన ఏడాది నుంచే అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త… తమకు పుట్టిన రెండేళ్ల బాబును భార్య నుంచి వేరు చేసి బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో.. రెండేళ్ల నా బాబు ను నాకు ఇప్పించండి సార్ అని అనంతపురం జిల్లా ఎస్పీని వేడుకున్న ఘటన పలువురిని కలిచి వేసింది.
జిల్లాలోని బుక్క పట్నం మండలం దూపంపల్లి కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ వినయకు వెంకటరెడ్డితో మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఏడాదికి వారికి ఒక బాబు(శశాంక్ రెడ్డి) పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి వెంకట రెడ్డి అతని కుటుంబ సభ్యులు వినయను అదనపు కట్నం కోసం వేధించసాగారు.
ఆమె కుటుంబ సభ్యులు డబ్బు సమకూర్చకపోవటంతో …వెంకట రెడ్డి అతని బంధువులు.. ఆమెను పుట్టింట్లోనే ఉంచి… ఏడాది వయస్సున్న బిడ్డను తీసుకువెళ్లిపోయారు. గత రెండేళ్లుగా ఆమెకు బిడ్డను కూడా చూపించలేదు. ఈ విషయమై ఆమె ధర్మవరం డీస్పీ రమాకాంత్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా కేసు తీసుకునేది లేదంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.
కాగా…సోమవారం అనంతపురం డీపీఓ కార్యాలయంలో జిల్లా ఏస్పీ బి.సత్యఏసుబాబు ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి హాజరైన వినయ తన కష్టాన్ని ఎస్పీకి భోరున విలపిస్తూ వివరించింది. పాలుతాగే పసికందు అనే కనికరం లేకుండా భర్త అతని బంధువులు తనబిడ్డను తీసుకెళ్లిపోయారని….కాళ్లావేళ్లా పడ్డ కనికరం చూపలేదని ఆవేదన చెందింది. డీఎస్పీ కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఎస్పీకి వివరించింది.
ఆమె బాధ చూసిన ఎస్పీ వెంటనే ధర్మవరం డీఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. అనంతరం కొత్తచెరువు సీఐ కు ఫోన్ చేసి వినయ, ఆమె బిడ్డ ఘటనపై ఆరా తీశారు. సీఐ చెప్పిన సమాధానంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఎస్పీ… ‘ఐదేళ్ల వరకూ బిడ్డ తల్లి వద్ద ఉండాలన్న విషయం నీకు తెలియదా? డూ వాట్ ఐ సే… మొదట బిడ్డను తల్లికి అప్పగించే ఏర్పాటు చేయ్’ అంటూ సీఐను ఆదేశించారు. నిన్న జరిగిన స్పందన కార్యక్రమానికి మొత్తం 89 ఫిర్యాదులు అందాయి.