Hot Summer In Tirumala
Tirumala : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎండలు మండిపోతున్నాయి. తిరుమలలో 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. మాడవీధుల్లో భక్తులకు కాళ్లు కాలకుండా తెల్లని పెయింట్, కార్పెట్లు వేశారు. కార్పెట్లు నిరంతరం తడిగా ఉండేలా ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. తిరుమలలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఎండల తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాడు పగిలేలా ఉన్న ఎండతో సతమతం అవుతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలికి వచ్చే భక్తులు
కాళ్లు కాలుతుండటంతో పరుగులు తీసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
కార్పెట్లను వేసిన టీటీడీ అధికారులు.. ఎప్పటికప్పుడు వాటిని నీటితో తడిపి అవి చల్లగా ఉండేలా చూస్తున్నారు. అలాగే వైట్ పెయింట్ కూడా వేయించారు. కార్పెట్లు, వైట్ పెయింట్ ద్వారా భక్తుల ఇబ్బందులను కొంతవరకు తగ్గించగలిగారు. వీటి ద్వారా ఎండల నుంచి భక్తులకు కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉంది. ఉదయం 10 నుంచి మొదలు.. ఎండల తీవ్రత తగ్గేవరకు మాఢవీధుల్లో లారీ ట్యాంకర్ల ద్వారా నీటిని వెదజల్లుతున్నారు. అలాగే భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
Also Read : ప్రతిరోజూ వేడి నీటిని ఎందుకు తాగాలి? 5 ఆరోగ్య ప్రయోజనాలివే..!