శ్రీకాకుళం: జీవనోపాధి కోసం కడలిని నమ్ముకున్న మత్స్యకారులు ఎన్నో కల్లోలాలను ఎదుర్కొన్నారు. తుపానులతో సముద్ర అల్లకల్లోంగా మారినా ఆటుపోట్లను ఎదుర్కొని చేపల వేట కొనసాగించారు. అటువంటి మత్స్యకారులు ఇప్పుడు సముద్రంలో వేటకు వెళ్లే పరిస్థితిలేదు. చేపలు గుడ్లు పెట్టి సంతతిని పెంచుకునే సమయం ఆసన్నకావడంతో 2019 ఏప్రిల్ 15 నుంచి రెండు నెలల పాటు వేటపై నిషేధం విధించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం చెల్లించే అరకొర సహాయం కూడా రెండేళ్లుగా నిలిచిపోవడంతో బతుకుపై బెంగతో మత్స్యకారులు కుమిలిపోతున్నారు.
చేపలు పిల్లలు పెట్టే సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపద హరించుకుపోతుందన్న ఉద్దేశంలో రెండు నెలల పాటు నిషేధం విధించింది ప్రభుత్వం. సముద్రంలో చేపల వేట నిషేధం అమల్లో ఉన్న కాలంలో మత్స్యకారులకు ప్రభుత్వం.. సహాయం అందించాలి. రెండు నెలల కాలానికి ఒక్కో కుటుంబానికి 4 వేల రూపాయల వంతున ఆర్థిక సాయం అందించాలి. కానీ మూడేళ్లుగా ఈసాయం నిలిచిపోయింది. దీంతో ఈసారి కూడా ఆర్థిక సహాయం అందే పరిస్థితిలేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 11 సముద్రతీర మండలాలు ఉన్నాయి. శ్రీకాకుళం, గార, నర్సన్నపేట, పోలాకి, సంతబొమ్మాళి, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్చాపురం మండలాల్లో సముద్రాన్ని నమ్ముకుని చేపల వేట కొనసాగించే మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు. జిల్లా మొత్తం మీద లక్షా 53 వేల మంది మత్స్యకారులు చేపల వేటకు దూరమయ్యారు. అటు చేపల వేటా లేక.. ఇటు ప్రభుత్వం నుంచి భృతి కూడా అందే పరిస్థితి లేకపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
జీవన భృతి కోసం అర్హులైన మత్స్యకారుల సంఖ్యను తేల్చేందుకు ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు సర్వే చేపట్టాలని మత్స్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చే అరకొర సహాయం కూడా రేషన్ కార్డుతో ముడిపెట్టారు. కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా… ఒకే యూనిట్‌గా పరిగణిస్తున్నారు. దీంతో ఒక్కరికే సాయం అందుతుంది. అది కూడా మూడేళ్లుగా జీవన భృతి ఇవ్వకపోవడంతో.. ఈసారైనా అందుతుందో లేదో అన్న ఆందోళనలో మత్స్యకారులు ఉన్నారు. రేషన్ కార్డులులేని మత్య్యకారుల కూడా వేల సంఖ్యంలో ఉన్నారు. జీవన భృతి విషయంలో వీరి పరిస్థితి అగమ్యగోచరంగానే మిగిలిపోతుంది. రేషన్ కార్డుల కోసం వీరు చేసిన ఆందోళన అరణ్యరోదనగానే మిగిలి పోయింది. ఇప్పటికైనా తమకు రేషన్ కార్డులు ఇచ్చి సకాలంలో భృతి చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నారు.