అక్టోబర్‌ 2న వాలంటీర్లకు చప్పట్లతో అభినందనలు…మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు

  • Publish Date - August 18, 2020 / 06:58 PM IST

అక్టోబర్‌ 2న రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజలందరూ చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు. మంగళవారం (ఆగస్టు 18, 2020) ఆయన మాట్లాడుతూ ఏడాదిలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో అనేక మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. సీఎం జగన్‌ తీసుకొచ్చిన ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.



మన వాలంటీర్ వ్యవస్థను కేంద్ర కేబినెట్ సెక్రటరీ అభినందించారని తెలిపారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల కోసం ఐఏఎస్‌ల శిక్షణ సిలబస్‌‌లో పాఠంగా చెప్తున్నారని మంత్రి వెల్లడించారు. కరోనా సమయంలో వాలంటీర్లు చాలా కీలకంగా పని చేశారని కొనియాడారు. గ్రామ సచివాలయాల ద్వారా 546 సేవలు, వాలంటీర్ల ద్వారా ప్రస్తుతం 35 సేవలు అందిస్తున్నామని తెలిపారు.



పరిపాలనా వికేంద్రీకరణను గ్రామస్థాయి నుంచి చేసి చూపిస్తున్నామని చెప్పారు. ఈ వ్యవస్థ వలన సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. చంద్రబాబు తమపై ఎన్ని విమర్శలు చేసినా తాము పని చేసి చూపించామని తెలిపారు.