Srikalahasti Constituency: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయం ఎలా నడుస్తోంది.. టీడీపీ మళ్లీ పట్టు బిగిస్తుందా?

శ్రీకాళహస్తిలో.. మరోసారి వైసీపీ, టీడీపీ మధ్యే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. చేజారిన కంచుకోటపై.. మళ్లీ పసుపు జెండా ఎగరేసేందుకు.. తెలుగుదేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి విజయం ఖాయమనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు.

Srikalahasti Assembly Constituency Ground Report

Srikalahasti Assembly Constituency: రాహు-కేతు (Rahu Ketu) క్షేత్రంలో.. రాజకీయం వేడెక్కింది., నిత్యం శివనామస్మరణతో మారుమాగే ఆ ప్రాంతంలో.. నాయకులు శివాలెత్తుతున్నారు. అదే.. ముక్కంటి కొలువైన.. శ్రీకాళహస్తి. తెలుగుదేశం (Telugu Desam Party) కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్‌లో.. ఇప్పుడు వైసీపీ (YCP) జెండా ఎగురుతోంది. మరి.. శ్రీకాళహస్తి.. టీడీపీ (TDP) మళ్లీ పట్టు బిగిస్తుందా? అధికార పార్టీని ఎదుర్కొనేందుకు.. పసుపు పార్టీ దగ్గరున్న వ్యూహాలేంటి? నియోజకవర్గంలో రాజకీయం ఎలా నడుస్తోంది? ఇచ్చిన హామీలేంటి? జరిగిన అభివృద్ధి ఏంటి? రాబోయే ఎన్నికల్లో.. ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో నిలవబోతున్నారు? ఓవరాల్‌గా శ్రీకాళహస్తిలో ఈసారి కనిపించబోయే సీనేంటి?

దక్షిణకాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తి.. రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి (Biyyapu Madhusudhan Reddy ).. తనని తాను జనం మనిషిగా చెప్పుకుంటుంటే.. బొజ్జల ఫ్యామిలీ ప్రత్యర్థిగా బలమైన పోటీనిచ్చేదిగా కనిపిస్తోంది. శ్రీకాళహస్తిలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే కంటే ముందు.. అక్కడి పొలిటికల్ హిస్టరీ (Political History) ఓసారి చూద్దాం. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు.. 16 సార్లు ఎన్నికలు జరిగాయ్. ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం.. 2 లక్షల 40 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది.

బీసీలు అధికంగా ఉండే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో.. ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులే. పల్లె రెడ్లుగా పిలిచే క్షత్రియ సామాజికవర్గం ఓటర్లు ఇక్కడ అధికంగా ఉంటారు. ఇతర కులాల డామినేషన్ ఎలా ఉన్నా.. డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బలిజ సామాజికవర్గ ఓటర్లేననే టాక్ ఉంది. ఇక్కడ.. వారి ఓట్ బ్యాంక్ 25 వేలకు పైనే ఉంది. అదేవిధంగా దళిత ఓటర్లు 40 వేల మందికి పైగా ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం ఓటర్లు 15 వేల మంది, కమ్మ సామాజికవర్గం ఓటర్లు 25 వేల మంది దాకా ఉన్నారు. గ్రామాల్లో పట్టున్న నాయకులుగా రెడ్డి సామాజికవర్గం నాయకులు పాతుకుపోవడంతో.. పార్టీ ఏదైనా వారిదే పైచేయి అన్నట్లుగా మారిపోయింది.

బియ్యపు మధుసూదన్ రెడ్డి (photo: facebook)

ప్రస్తుతం.. శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. తొలిసారి.. ఇక్కడ వైసీపీ ఖాతా ఓపెన్ చేసింది. ఎమ్మెల్యే మధుసూదన్.. సీఎం జగన్‌కు ఆత్మీయుడనే ముద్ర ఉంది. శ్రీకాళహస్తిలో సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల స్కీమ్స్‌కు.. ఏకంగా గుడి కట్టారు. ఇక.. రాజకీయంగానూ అన్ని మండలాలపై పట్టు సంపాదించుకున్నారు. ఇప్పుడు.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో.. అన్ని ఊళ్లు చుట్టేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో జనం మధ్యే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత సంక్షేమం, ఎప్పుడూ జరగనంత అభివృద్ధి.. వైసీపీ పాలనలో జరిగిందని చెబుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా.. నియోజకవర్గంలో 25 వేల జగనన్న ఇళ్ల నిర్మాణ పనులతో.. అభివృద్ధి పరుగులు పెడుతోందని చెబుతున్నారు.

వైసీపీ వెర్షన్ ఇలా ఉంటే.. శ్రీకాళహస్తిలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని.. ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గం కంటే.. ఎమ్మెల్యే అభివృద్ధే ఎక్కువ జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పాలనలో.. బొజ్జల హయాంలోనే.. ఇక్కడ అభివృద్ధి జరిగిందని.. టీడీపీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudhir Reddy) చెబుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో.. శ్రీకాళహస్తిలో చేసిన పనులు, జరిగిన అభివృద్ధి ఏమిటో చూపాలని సవాల్ విసురుతున్నారు. ఎమ్మెల్యే భూకబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి, అధికార దుర్వినియోగంలో.. అభివృద్ధి నవ్వులపాలైందని ఆరోపిస్తున్నారు.

బొజ్జల సుధీర్ రెడ్డి (photo: facebook)

సుధీర్ రెడ్డికి.. కొత్త తలనొప్పులు
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని దీటుగా ఎదుర్కొంటున్న టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి.. కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తాజాగా.. లోకల్ టీడీపీలో విభేదాలు రోడ్డున పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు (SCV Naidu).. వైసిపి నుంచి తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తుండటంతో.. కొత్త దుమారం రేగింది. గత ఎన్నికలకు ముందే.. ఎస్సీవి నాయుడు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరారు. గత నాలుగేళ్లలో.. ఆయనకు అధికార పార్టీలో ఆశించినంత ప్రాధాన్యత దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడ్డారు. ఇక లాభం లేదని.. మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే.. ఆయన చేరికను.. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో తన ఓటమి కోసం పనిచేసిన వ్యక్తిని.. పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే.. సుధీర్ రెడ్డితో సంబంధం లేకుండా పార్టీలో చేరేందుకు ఎస్సీవీ నాయుడు సిద్ధపడ్డారు. చంద్రబాబును కలిసి.. ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించారు. చంద్రబాబుతో భేటీకి కూడా సిద్ధమయ్యారు. అనుచరులతో పాటు వెళ్లి.. బాబుని కలిసి పసుపు కండువా కప్పుకునేందుకు మూహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే.. ఎస్సీవీ నాయుడు చేరికకు.. బొజ్జల సుధీర్ రెడ్డి బ్రేక్ వేశారు.

ఎస్సీవీ నాయుడు (photo: facebook)

ఎస్సీవీ నాయుడి చేరిక వాయిదా
టీడీపీలో ఎస్సీవీ నాయుడి చేరికకు సంబంధించి.. తనను సంప్రదించలేదని.. పార్టీ పెద్దలు కూడా తనతో మాట్లాడలేదన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. అందువల్ల ఎస్సీవీ నాయుడి వెంట ఎవరూ అమరావతికి వెళ్లొద్దని క్యాడర్‌కు సందేశాలు పంపారు. తనను కాదని.. ఎవరైనా వెళితే.. వ్యవహారం మరోలా ఉంటుందని.. పరోక్షంగా హెచ్చరించారు. దాంతో.. తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోయారు. అధిష్టానం కూడా ఎస్సీవీ నాయుడి చేరికను వాయిదా వేసింది. ఈ వరుస పరిణామాలు.. శ్రీకాళహస్తి రాజకీయాల్లో హాట్ టాపిక్‌(hot topic)గా మారాయి. అయితే.. ఈ ఇష్యూ సమసిపోయాక.. పరిణామాలు ఎలా ఉంటాయనేదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎస్సీవీ నాయుడు గనక తిరిగి టీడీపీలో చేరితే.. ఆయన పార్టీకి బలంగా మారతారా? ఆయన చేరిక నష్టం చేస్తుందా? అన్నది.. మున్ముందు చూడాలి.

Also Read: కాకాణి వర్సెస్ సోమిరెడ్డి.. ఈసారి పైచేయి ఎవరిదో.. సర్వేపల్లి ఎవరికి జైకొడుతుంది?

కోటా వినూత (photo: facebook)

ఆసక్తిగా వైసీపీ, టీడీపీ ఎలక్షన్ వార్ 
ఏదేమైనా శ్రీకాళహస్తిలో.. మరోసారి వైసీపీ, టీడీపీ మధ్యే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. చేజారిన కంచుకోటపై.. మళ్లీ పసుపు జెండా ఎగరేసేందుకు.. తెలుగుదేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి.. విజయం ఖాయమనే ధీమాలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన చేతిలో ఓటమిపాలైన బొజ్జల సుధీర్ రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. దాంతో.. ఎలక్షన్ వార్ ఆసక్తిగా ఉండబోతుందనే చర్చ మొదలైంది. సొంత పార్టీ నుంచి అసమ్మతి లేకపోవడం.. ఎమ్మెల్యే మధుసూదన్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

Also Read: కుప్పంలో చంద్రబాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా.. బాబు కీలక నిర్ణయం ఏంటి?

ఇక.. శ్రీకాళహస్తిలో బీజేపీ, జనసేన పార్టీల నాయకులున్నా.. వాటి ప్రభావం నియోజకవర్గంలో అంతంతమాత్రమే. అయినప్పటికీ.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన కోలా ఆనంద్(Kola Anand), జనసేన తరఫున బరిలో దిగిన కోటా వినూత (Vinutha Kotaa).. రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్‌గా.. రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.