తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన తీవ్ర ఉద్రికతలకు దారితీస్తోంది. రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన రాజకీయంగానూ వివాదంగా మారింది. అంతర్వేదిలో ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. దీనిపై ఇప్పటికే పలు హిందూ సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. మంగళవారం(సెప్టెంబర్ 8,2020) అంతర్వేది ఆలయ ప్రాంగణంలో నిరసనల హోరు కనిపించింది. తాజాగా రథం దగ్ధం ఘటనను నిరసిస్తూ ఇవాళ(సెప్టెంబర్ 9,2020) అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం ‘చలో అంతర్వేది’కి బీజేపీ, జనసేన సహా వివిధ ధార్మిక, మత సంస్థలు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొందరు నేతలను గృహ నిర్బంధం చేశారు.
చలో అంతర్వేదికి బీజేపీ, జనసేన పిలుపు:
బీజేపీ, జనసేన నేతలు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ ఛలో అంతర్వేదికి పిలుపునిచ్చారు. దీంతో అంతర్వేదిలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూపరిషత్, బీజేపీ, జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు కార్యకర్తలను సైతం బైండోవర్ చేస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అంతర్వేది చుట్టు పక్క ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత పెంచారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు.
రథం దగ్ధం ఘటనపై దర్యాప్తు ముమ్మరం:
మరోవైపు అంతర్వేది రథం దగ్ధం ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావు తెలిపారు. అంతర్వేది ఆలయంలో ఫోరెన్సిక్ ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అంతర్వేది ఆలయ పరిసరాల్లో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, బయటి ప్రాంతాల వారు ఇక్కడికి రావడంపై నిషేధాజ్ఞలు ఉన్నాయని స్పష్టం చేశారు. అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు.
https://10tv.in/how-did-the-62-year-old-antarvedi-chariot-burn-down/
అగ్నిప్రమాదం ఎలా జరిగింది?
సెప్టెంబర్ 5 అర్ధరాత్రి తర్వాత అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం మంటల్లో కాలిపోయింది. సుదీర్ఘకాలంగా ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ఈ రథాన్ని వినియోగించేవారు. అంతర్వేది రథోత్సవం అత్యంత ఉత్సాహంగా సాగేది. భక్తులు పవిత్రంగా భావించే ఈ రథం మంటల్లో కాలిపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. తొలుత షార్ట్ సర్య్యూట్ అని, ఆ తర్వాత తేనె సేకరణ ప్రయత్నంలో జరిగిన ప్రమాదం అని ప్రచారం జరిగింది. ఏదీ నిర్ధరణ కాకపోవడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.
క్లూస్ టీమ్, డాగ్ స్క్యాడ్ సహాయంతో విచారణ చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించారు. వారిలో అంతర్వేది ఆలయ సిబ్బంది కూడా ఉన్నారనే ప్రచారం సాగింది. కానీ పోలీసులు నిర్ధరించలేదు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఇప్పటికీ నిర్ధరణకు రాలేదు. పూర్తిస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉందని చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
రథం ఎ్తతు 40 అడుగులు, 60ఏళ్ల కిందట తయారీ:
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం అగ్నికి ఆహుతయ్యింది. శనివారం(సెప్టెంబర్ 5,2020) అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రతి సంవత్సరం కల్యాణోత్సవంలో ఉత్సవమూర్తులను రథంపై ఉంచి ఊరేగిస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరుస్తారు. రాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకొని రథం దగ్ధం అయింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా అనే కోణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 40 అడుగుల ఎత్తైన ఈ రథాన్ని 60 ఏళ్ల కిందట తయారు చేశారు.
జిల్లాలోని సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో ఉంటుందీ ఆలయం. అంతర్వేది తిరునాళ్లుగా రాష్ట్రం మొత్తం గుర్తింపు పొందింది. అంతర్వేది ఆలయం వెలుపల నిర్మించిన షెడ్‌లో స్వామివారి రథాన్ని ఉంచుతారు. ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాల సందర్భంగా.. ఈ రథాన్ని బయటికి తీసుకొస్తారు. ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు.
ప్రమాదమా? కుట్ర కోణమా?
ఈ ఘటన ప్రమాదవశావత్తు చోటు చేసుకుందా? లేక ఉద్దేశపూరకంగా పాల్పడ్డారా? అనేది తెలియాల్సి ఉంది. ఆరు దశాబ్దాల కిందట ఈ రథాన్ని తయారు చేశారని, ఇప్పుడిలా మంటల్లో కాలిపోవడం అపశకునం అంటూ స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రథాన్ని ఉంచే షెడ్డులో విద్యుత్ సరఫరా కోసం ఒకట్రెండు బల్బులు మాత్రమే ఉన్నాయని, షార్ట్ సర్క్యూట్ సంభవించి, రథాన్ని దహనం చేసేంత స్థాయిలో ఓల్టేజీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.