ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనితను కలిసిన సుగాలి ప్రీతి తల్లి

కేసును రీ ఓపెన్ చేసి, సీఐడీ అధినేత రవి శంకర్ అయ్యాన్నార్ తో విచారణ చేయిస్తామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారని..

Home minister Anitha Vangalapudi

హత్యాచారానికి గురైన తన కూతురికి న్యాయం చేయాలని హోం మంత్రి అనితను కలిసి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి విజ్ఞప్తి చేశారు. తన కూతురిపై దారుణానికి పాల్పడ్డ వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఐడీ విచారణకు ఆదేశాలు ఇస్తామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పార్వతి దేవి మాట్లాడుతూ.. తన కుమార్తె సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం హోంమంత్రి అనితను కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. గత నెల 30వ తేదీన పవన్ కల్యాణ్‌ను కలిస్తే, తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏడేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నామని, తమకు అండగా ఉన్న ప్రజా సంఘాల నాయకుడు బాల సుందరం, జనసేన నాయకులను పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మంత్రి అనితకు వివరించామని అన్నారు.

కేసును రీ ఓపెన్ చేసి, సీఐడీ అధినేత రవి శంకర్ అయ్యాన్నార్ తో విచారణ చేయిస్తామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారని వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసును సీబీఐకి ఇస్తున్నట్లు తప్పుడు జీవో ఇచ్చి తమను మోసం చేసిందని అన్నారు. పోలీస్ అధికారులు మొదలుకుని ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి వరకు తన కూతురి కేసులో నిందితులకు శిక్ష పడకుండా కాపాడారని చెప్పారు.

ప్రజా సంఘాల నాయకుడు బాల సుందరం మీడియాతో మాట్లాడుతూ.. ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి, హత్య చేస్తే.. చివరకు దాన్ని బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ కేసును తప్పుదోవ తట్టించిన దాంట్లో మాజీ సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఉన్నారని, ఆయనను కూడా విచారించాలని చెప్పారు. స్కూల్‌కి వెళ్లిన అమ్మాయిని అత్యాచారం చేసి, హోమ్ డెలివరీ చేయడం చాలా బాధాకరమని అన్నారు.

Also Read: ఇందులో నిజం లేదు.. కొత్త పన్నాగం మొదలు పెట్టారు: సజ్జల ఆగ్రహం

ట్రెండింగ్ వార్తలు