AP Congress : షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏపీ కాంగ్రెస్

వైయస్సార్సీపి నాయకులు కాంగ్రెస్ నుకానీ, గాంధీ కుటుంబాన్నికానీ విమర్శిస్తే ఊరుకునేది లేదని సుంకర పద్మశ్రీ హెచ్చరించారు.

Sunkara Padma Shri

AP Politics : వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం చంద్రబాబు కుట్ర అన్నారు. అయితే, షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చి చెప్పారాయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని, అలాంటి పార్టీని మేము పట్టించుకోమని సజ్జల వ్యాఖ్యానించారు. సజ్జల వ్యాఖ్యలపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అధికారం కోల్పోతున్నామని భయంతో సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికార దాహంతో గత ఎన్నికల సమయంలో రాజశేఖర్ రెడ్డి మరణాన్ని వాడుకుని ప్రజల ముందుకు వచ్చాడు .. తప్పుడు ప్రచారాలుచేసి అసత్యాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేశారని సుంకర పద్మశ్రీ విమర్శించారు.

Also Read : Sajjala Ramakrishna Reddy : షర్మిల వల్ల వైసీపీకి నష్టం లేదు

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అనుమానాలు ఉంటే అధికారంలోఉన్న నాలుగున్నర సంవత్సరాలుగా ఏం చేశారు?, విచారణ ఎందుకు చేయలేదు? అంటూ సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవించి పార్టీలోకి వచ్చారని, రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరిక అనే విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు షర్మిల వచ్చారని అన్నారు. షర్మిలను చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. ఒక్క చాన్స్ అంటే రాష్ట్ర ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారు.. ఇప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చామా అని బాధపడుతున్నారని సుంకర పద్మశ్రీ తెలిపారు.

Also Read : YS Sharmila : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల

జగన్ పాలనను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారంచేసి కాంగ్రెస్ పార్టీని వాడుకుని అధికారంలోకి వచ్చేందుకు జగన్, సజ్జల చూస్తున్నారని సుంకర పద్మశ్రీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడానికి వైయస్సార్సీపి నాయకులకు సిగ్గుండాలి. కేసులకు భయపడి జైల్లోకి వెళ్లాల్సి వస్తుందని బిజెపితో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ కేంద్రం ముందు జగన్ మోకరిల్లుతున్నాడు. రాష్ట్రంలో భూకబ్జాలు, దోపిడీతో ప్రజలను వైఎస్ఆర్సిపీ నాయకులు హింసిస్తున్నారని, ప్రతిపక్షాలపై కుట్రలు పన్ని, ఆక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు

రాజశేఖర్ రెడ్డి కల.. పోలవరం ప్రాజెక్టును కూడా నేటికీ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయాడని సుంకర పద్మ విమర్శించారు. జగన్ అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసిన చెల్లిని కనీసం పట్టించుకో లేదు.. షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే సజ్జలతో జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడించాడని అన్నారు. ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ఆమెను చూసి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు భయపడుతున్నారు.. అందుకే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైయస్సార్ మరణాన్ని వాడుకుని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకు చూస్తున్నారని విమర్శించారు.

వైయస్సార్సీపి నాయకులు కాంగ్రెస్ నుకానీ, గాంధీ కుటుంబాన్నికానీ విమర్శిస్తే ఊరుకునేది లేదని సుంకర పద్మశ్రీ హెచ్చరించారు. ఎన్ని విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడులాగా, టీడీపీ నేతల్లా చూస్తూ ఊరుకోమన్నారు. తప్పుడు ప్రచారంచేస్తే ఇంటికొచ్చి మరి కొడతామని  హెచ్చరించారు.  వైయస్సార్ పేరు జగన్ సర్వనాశనం చేశాడు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు నిజమైన వారసులు కాంగ్రెస్ వాదులే. రాజశేఖర్ రెడ్డి ఆస్తులకే జగన్మోహన్ రెడ్డి వారసుడని సుంకర పద్మశ్రీ అన్నారు.