Kakani Govardhan Reddy: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు..

విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాణి తరపు న్యాయవాదులు బతిమిలాడినా ధర్మాసనం కరుణించలేదు.

Kakani Govardhan Reddy: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వార్ట్జ్ గనుల్లో అక్రమాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల నిల్వ, అట్రాసిటీ కేసుల్లో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసుల్లో ఆయన 2 నెలలుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గతంలోనే ఏపీ హైకోర్టు నిరాకరించింది. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. కాకాణి పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాణి తరపు న్యాయవాదులు బతిమిలాడినా ధర్మాసనం కరుణించలేదు. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాదులు గుంటూరు ప్రేరణ, గుంటూరు ప్రమోద్ లు వాదనలు వినిపించారు. కాకాణి తరపున హైకోర్టు మాజీ న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు.

అరెస్ట్ భయంతో కాకాణి రెండు నెలలుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. గతంలో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు నిరాకరించింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అత్యున్నత న్యాయస్థానంలోనూ కాకాణికి ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కాకాణి ఎలాంటి తప్పు చేయకుంటే, నిజాయితీగా ఉండి ఉంటే.. పోలీసులకు దొరక్కుండా ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. పరారీలో ఉన్న కాకాణి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.