సొంత పార్టీలోనే ప్రత్యర్థులు.. ఎమ్మెల్యే శ్రీదేవిని టార్గెట్ చేస్తుంది ఎవరు?

  • Publish Date - October 2, 2020 / 05:42 PM IST

tadikonda mla sridevi: గుంటూరు జిల్లాలో కీలమైన ఎస్సీ నియోజకవర్గం తాడికొండ. రాజధాని అమరావతి పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్‌లో వైద్య వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారామె. రాజకీయాలపై అంతగా అనుభవం లేకపోవటమో? లేక ఈ రాజకీయాల రొంపి గురించి లోతుగా తెలుసుకోలేకపోవటమో… కారణం ఏదైనా శ్రీదేవి గుట్టుగా ఏ పని చేద్దామన్నా అది రట్టైపోతూ.. చివరకు ఆమె ఇమేజ్‌నే డ్యామేజ్ చేసేస్తోందని అనుచరులు ఫీలవుతున్నారు.

చాన్స్ చిక్కితే చాలు శ్రీదేవిని ఇరికించేందుకు ప్రయత్నాలు:
హేమాహేమీల కళ్లన్నీ రాజధాని అమరావతి ప్రాంతంపైనే ఉంటాయి. ఇసుక వ్యవహారాలు, భూముల లావాదేవీలు.. ఇలాంటివన్నీ ఈ నియోజకవర్గంలో అధికంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పాత్ర సైతం కీలకంగానే ఉంటుంది. ఇదే పలువురు వైసీపీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదంట. ఏదో విధంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పెత్తనానికి చెక్ పెట్టి, తమ హవా సాగించేందుకు ఓ వర్గం ఎత్తులకు పై ఎత్తులు వేస్తోందట. చిన్న అవకాశం దొరికితే చాలు శ్రీదేవిని ఇరికించేందుకు చకచకా పావులు కదుపుతున్నారని ఆమె వర్గీయులు లబోదిబోమంటున్నారు.

పేకాట వ్యవహారంలో అనుచరుడు పట్టుబడితే శ్రీదేవి వదిలేయమన్నారా?
కొద్ది నెలల క్రితం ఓ పేకాట వ్యవహారంలో పట్టుబడ్డ తన అనుచరుడిని వదిలిపెట్టాలని ఎమ్మెల్యే శ్రీదేవి ఆదేశించారన్న విమర్శలు సంచలనం రేకెత్తించాయి. ఎమ్మెల్యే శ్రీదేవిని టార్గెట్ చేస్తూ నానా యాగీ చేయించింది వైసీపీలోని ఓ వర్గమేనని అంతా చెప్పుకుంటున్నారు. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు అనధికారికంగా పెద్ద ఎత్తున పేకాట కార్యకలాపాలు సాగిస్తుంటే బయటకు పొక్కని వ్యవహారాలు… శ్రీదేవి విషయంలోనే ఎందుకు రచ్చ చేయాల్సి వచ్చిందోనని చర్చించుకుంటున్నారు.

ఎమ్మెల్యే, పోలీసు అధికారి సంభాషణలు ఎలా బయటకొచ్చాయి?
ఆ విషయాన్ని పక్కన పెడితే తన వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదంటూ శ్రీదేవి అనుచరుడు ఒకరు ఆమెపై ఏకంగా మీడియాకెక్కారు. ఆమె సంభాషణలన్నీ బయటపెట్టి ఎన్నికల సమయంలో నడిచిన ఆర్థిక వ్యవహారాలన్నీ రట్టు చేసి ఎమ్మెల్యే శ్రీదేవిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టారు. తాజాగా ఇసుక అక్రమార్కులను వదిలిపెట్టాలంటూ ఓ సీఐతో ఎమ్మెల్యే జరిపిన సీరియస్ సంభాషణలన్నీ బయటపెట్టి రచ్చరచ్చ చేశారు.

ఓ పోలీసు అధికారి, ఎమ్మెల్యే సంభాషణలను బయటపెట్టడమంటే అంత ఆషామాషీ కాదు. పోలీసు నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలు ఇలా చాలా ఉంటాయి. అలా కాకుండా ఎమ్మెల్యే సంభాషణలను సీఐ బయటపెట్టడమంటే దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని అంటున్నారు. ఇప్పుడు ఇదే చర్చ గుంటూరు జిల్లా వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎమ్మెల్యే శ్రీదేవిని సొంత పార్టీలోనే టార్గెట్ చేస్తున్నది ఎవరు?
ఎమ్మెల్యే శ్రీదేవిని సొంత పార్టీలోనే ఎవరు టార్గెట్ చేస్తున్నారన్న దానిపై చర్చ సాగుతోంది. ఉండవల్లి శ్రీదేవికి, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌కు మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. సురేశ్‌.. బాపట్ల ఎంపి అయినప్పటికీ రాజధాని ప్రాంతానికి స్థానికుడు. దీంతో సాధారణంగానే సొంత ప్రాంతంలో తన పెత్తనం సాగాలన్న కోరిక ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు అదే శ్రీదేవికి తలనొప్పులు తెచ్చిపెట్టడానికి కారణమౌతుందని శ్రీదేవి వర్గీయులు భావిస్తున్నారట. మరో వర్గం కూడా శ్రీదేవిని టార్గెట్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గం తాడికొండ రాజకీయాలపై పట్టు కోసం తెర వెనుక శ్రీదేవిని టార్గెట్ చేస్తోందనే టాక్‌ నడుస్తోంది.

అంబటి డైరెక్షన్‌లోనే శ్రీదేవిని టార్గెట్‌ చేస్తున్నారనే టాక్‌:
టీడీపీ నుంచి వైసీపీలో డొక్కా చేరే సమయంలోనే వచ్చే ఎన్నికల్లో తాడికొండ టికెట్‌తో పాటు ఈ నాలుగేళ్లు తాడికొండలో తన హవా సాగేలా వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అధిష్టానం వద్ద ఒప్పందం చేశారని అంతా అనుకుంటున్నారు. ఆ క్రమంలోనే అంబటి రాంబాబు డైరెక్షన్‌లోనే శ్రీదేవిని టార్గెట్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమార్కుల విషయంలో శ్రీదేవికి, సీఐకి మధ్య జరిగిన సంభాషణ బహిర్గతం కావడానికి డొక్కా వర్గమే కారణమని ప్రచారం జరుగుతోంది. అంబటి కనుసన్నల్లోనే శ్రీదేవిపై బురద జల్లే డ్రామా నడిచిందన్న వార్తలు ఇప్పుడు శ్రీదేవి వర్గాన్ని కలవరపాటుకు గురి చేస్తోందట.

అధికార పార్టీ రచ్చ టీడీపీకి కలసి వస్తుందా?
పోలీసు, రెవెన్యూతో సహా అధికార యంత్రాంగం మొత్తాన్ని అంబటి కనుసన్నల్లో డొక్కా వర్గం నడిపిస్తోందని, అందులో భాగంగానే ఫోన్‌ సంభాషణ బయటకు వచ్చిందని అంటున్నారు. అధికార పార్టీలో రచ్చ ప్రతిపక్ష టీడీపీకి వినోదభరితంగా మారిందట. వైసీపీ నేతలు మాత్రం పార్టీ బజారున పడడంతో ఫీలవుతున్నారట. తాడికొండ వైసిపి రాజకీయాలు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతాయో? ఎమ్మెల్యే శ్రీదేవి పొలిటికల్ కెరీర్ ఎలా సాగుతుందోననే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.