టీడీపీలో అసమ్మతి సెగలు.. కిమిడి నాగార్జున రాజీనామా, నూకసాని సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నాలుగో జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపింది. టికెట్ రాని నాయకుల మద్దతుదారులు పలు జిల్లాల్లో ఆందోళనలతో హోరెత్తించారు.

TDP 4th list rift: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లతో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తుది జాబితా చిచ్చు రేపింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుల మద్దతుదారులు పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పలువురు నాయకులు పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు.

చీపురుపల్లిలో నిరసన సెగలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్‌ను కళా వెంకటరావుకి ఇవ్వడంపై కిమిడి నాగార్జున వర్గీయులు ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతల ఫ్లెక్సీలను చించేసి నిరసన తెలిపారు. కళా వద్దు.. నాగార్జున ముద్దు అంటూ నినాదాలు చేశారు.

కిమిడి నాగార్జున రాజీనామా
విజయనగరం పార్లమెంట్ ఇంచార్జ్, చీపురుపల్లి ఇంచార్జ్ పదవులకు కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడితే చివరికి నాకు క్షవరం చేశారు. కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుందని అమ్మా, నాన్నలు చెప్పారు. వారు చెప్పినట్లే పార్టీ కోసం కష్టపడ్డా కానీ లాబీయింగ్ చేస్తేనే పని జరుగుతుందని తెలుసుకోలేకపోయాను. నా అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాన”ని అన్నారు.

గుంతకల్లులో టీడీపీ ఆఫీసు ధ్వంసం
అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ గుమ్మనూర్ జయరాంకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు భగ్గుమన్నారు. గుంతకల్లు పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ద్రోహం చేసి, రూ.50 కోట్లకు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు.

మహిళా నేతల వినూత్న నిరసన
అనంతపురం టీడీపీ అర్బన్ కార్యాలయం వద్ద మహిళా నేతల వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు, లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డబ్బు కోసం చంద్రబాబు, లోకేశ్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ.. తాళిబొట్లు చూపుతూ నిరసన తెలియజేశారు. చంద్రబాబుకు డబ్బే ముఖ్యమైతే తమ తాళిబొట్లు అమ్ముకోవాలంటూ మండిపడ్డారు. ఐదేళ్ల పాటు కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి పనిచేశామన్నారు. ప్రభాకర్ చౌదరి కాకుండా మరో వ్యక్తి ఇక్కడికి వస్తే సహించేది లేదని.. ఎవరు ఇక్కడికి వచ్చినా తరిమి కొడతామని హెచ్చరించారు. డబ్బుకు అమ్ముడు పోయే పార్టీగా తెలుగుదేశం పార్టీ మారిందని దుయ్యబట్టారు. మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

Also Read: ఎవరిని అడిగి టికెట్ ఇచ్చారు.. చంద్రబాబు పిలిచినా వెళ్లను: ప్రభాకర్ చౌదరి

నూకసాని బాలాజీ సంచలన వ్యాఖ్యలు
ఎంపీ సీటు తనకు కేటాయించకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్న ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప‌్రకాశం జిల్లా ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో జరిగిన 42వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యత లభించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను రెండు, మూడు రోజుల్లో బట్టబయలు చేస్తానని వెల్లడించారు. నా మాటే చెల్లుబాటు కావాలంటూ కొంతమంది అహంకారపు రాజకీయాలు చేస్తున్నారని, వారి బండారం బయటపెడతానని హెచ్చరించారు. తదుపరి తన కార్యాచరణను రెండు రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు.

Also Read: అదృష్టమంటే ఈమెదే..! పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి లక్కీచాన్స్‌..!

సత్యవేడు అభ్యర్థిని మార్చాలంటూ..
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కోనేటి ఆది మూలంకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గళం విప్పారు. తిరుపతిలోని ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాలు నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. కోనేటి ఆదిమూలంను తప్పించాలని, లేకుంటే పార్టీ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. చంద్రబాబు, సైకిల్ గుర్తును చూసి ఓట్లు వేసే వాళ్లమని, ఈ సారి ఆ పరిస్థితి లేదంటూ ప్రజలు ఛీత్కరిస్తున్నారని వెల్లడించారు. కోనేటి ఆది మూలంను చూసి ఓట్లు అడిగే పరిస్థితి లేదని, ఆయనను కొనసాగిస్తే టీడీపీ గెలిచే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టారు. ఆది మూలంను తప్పించి ఓ కొత్త వ్యక్తిని ప్రకటిస్తేనే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు