Ycp
TDP, BJP leaders joined the YCP : టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ముఖ్య నేతలు పార్టీలో చేరారు. గతంలో టిక్కెట్లు ఆశించి వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నాయకులను తిరిగి విజయసాయిరెడ్డి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తారని.. టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని చెప్పారు. అన్ని కులాలు, ఉప కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. 2024 నాటికి టీడీపీ ఖాళీ అవుతుందని.. ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుందని ఎద్దేవా చేశారు. పెద్ద నాయకులు తమ టచ్ లో వున్నారని.. వారితో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. పనితీరు ఆధారంగా అందరికీ సముచిత స్థానం ఇస్తామని చెప్పారు.
లోకేష్ అనారిక ప్రవర్తన చూస్తే అయనకు ఎవరో తప్పుడు సలహా ఇస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. అసభ్యమైన భాషను ప్రజలు హర్షించబోరని పేర్కొన్నారు. లోకేష్ పదజాలం చూస్తే రాజకీయాలకు అర్హుడా అని అనిపిస్తోందన్నారు. అమెరికా వెళ్లి ఎంబీఏ చదివాడా, లేదంటే అవన్నీ బోగస్ డిగ్రీల అనే అనుమానం కలుగుతుందని చెప్పారు.
ఉపఎన్నికల్లో వైసీపీదే విజయం అన్నారు. కుప్పం, అనంతపురంలో టీడీపీ డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని.. ఆ పార్టీకి జనం బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడం లేదని స్పష్టం చేశారు.
మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలనే సాంప్రదాయాన్ని టీడీపీ తప్పిందన్నారు. టీడీపీ ధ్వంద్వ ప్రమాణాల వల్లే చాలా చోట్ల పోటీకి కారణం అయిందని తెలిపారు.