గవర్నర్‌తో చంద్రబాబు భేటీ.. 14పేజీల లేఖతో ఫిర్యాదు

  • Publish Date - June 18, 2020 / 01:51 PM IST

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర గవర్నర్‌ భిష్వ భూషణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంంగా ఆయన 14 పేజీల లేఖను గవర్నర్‌కి అందజేశారు. ఏపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో తెలిపారు. పార్టీకి చెందిన 33 మంది ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసుల వివరాలను ఏపీ గవర్నర్ భిష్వ భూషణ్‌కు చంద్రబాబు అందజేశారు. 

ఏడాది కాలంలో కార్యకర్తలపై 800 దాడులు జరిగాయని ఫిర్యాదు చేశారు చంద్రబాబు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దాదాపు గంట నుంచి గవర్నర్ తో భేటీలో రాష్ట్రంలో ఏడాదిగా జరుగుతున్న పరిణామాలపై ఒక నివేదిక రూపంలో సమర్పించారు. ప్రభుత్వ అక్రమాలపై టీడీపీ తయారు చేసిన ఒక ఛార్జ్ షీట్ ను కూడా గవర్నర్‌కు సమర్పించినట్టు సమాచారం.