Chandrababu
Chandrababu: ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న వ్యవసాయం నేడు దుర్భరంగా మారిందని, ఉద్యాన పంటలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ అందడంలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు వద్ద గోడువెళ్లబోసుకున్నారు రైతులు. కృష్ణాజిల్లా నెక్కలం గొల్లగూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామంలో ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు చంద్రబాబు వద్ద తమ సమస్యలు చెప్పుకొచ్చారు. వ్యవసాయం దుర్భరంగా మారిందని, ఉద్యాన పంటలకు ఎలాంటి రాయితీ అందట్లేదని రైతులు వివరించగా..తమ పిల్లల ఉన్నత విద్యకు ఎక్కడా రుణాలు కూడా దక్కట్లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం విదేశీ విద్యా పథకం అమలుకాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఉక్రెయిన్ లో వైద్య విద్యను మధ్యలో వదిలేసుకుని వచ్చిన తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని విద్యార్థులు వాపోయారు. ఈసందర్భంగా నెక్కలం గొల్లగూడెం గ్రామ ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల చెవిలో పూలు పెట్టానని భావిస్తున్న జగన్ రెడ్డికి ప్రజలంతా కలిసి చెవిలో పూలు పెట్టే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. అధికార పార్టీ అరెస్టులకు భయపడి రైతులు రోషం చంపుకోవద్దని..ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని భయపెడతారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వల్ల రాష్ట్రంలో ఏరైతు ఆనందంగా లేడని అన్నారు. అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.12500 ఇస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు రూ.7500 మాత్రమే ఇస్తూ దొంగ లెక్కలు చెప్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
Also read:Minister Kakani : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు పెట్టకుండా అడ్డుకుంటామని ఈసందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. తమ హయాంలో పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ వైకాపా నేతలు దుష్ప్రచారం చేశారని..కాని కొండను తవ్వి ఎలుక తోకపై వెంట్రుక కూడా పట్టుకోలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గత ఏడాది వరదలకు పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి ఇప్పటికి మూడు సీజన్లు అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని..పోలవరం కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం పూర్తిగా నష్టపోయిందని ఆయన అన్నారు.
Also read:Anilkumar Yadav: నెల్లూరులో ఫ్లెక్సీల రగడ: స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్