చంద్రబాబును హెచ్చరించే అర్హత జగన్‌కు లేదు: రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి

జగన్ ప్రజలకు ముఖం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు ముఖం చూపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు.

Srinivasa Reddy Reddeppagari: తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని హెచ్చరించే అర్హత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పిన్నెల్లిని జైలుకెళ్లి కలవడం వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రజలకు ముఖం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు ముఖం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఏమైనా గాంధీ మహాత్ముడా అని ప్రశ్నించారు.

అధికారం పోవడంతో ప్రస్టేషన్‌లో జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పిన్నెల్లిపై కేసులతో చందబాబుకు ఏమాత్రం సంబంధం లేదని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే పిన్నెల్లిపై కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే ఎన్నికల సంఘం పిన్నెల్లిపై కేసులు పెట్టిందని తెలిపారు. రాజారెడ్డి రాజ్యాంగం పోయి.. ఇప్పుడు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతోందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే హామీలు అమలు చేయమని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు.

Also Read : చంద్రబాబును కోరడం లేదు.. హెచ్చరిస్తున్నాం: వైఎస్ జగన్ ఫైర్

”ఐదేళ్లు విధ్వంస పాలన చేశారు. వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు నష్టపోయారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చి.. 164 సీట్లు కట్టబెట్టారు. 5 సంవత్సరాలు ప్రజలను తప్పుదారి పట్టించారు. మీ మాటలను ప్రజలు ఇక నమ్మరు. మీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. జగన్ అవినీతి కేసులపై దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటివి చేస్తున్నారు. పరిపక్వత లేని జగన్.. చంద్రబాబును హెచ్చరిస్తూ మాట్లాడటం శోచనీయమ”ని రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు