Yanamala Ramakrishnu
Yanamala Ramakrishnudu: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ ను నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీఎస్ గా బీసీ అధికారి అయిన విజయానంద్ ను నియమించినందుకు చంద్రబాబుకు యనమల ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర చరిత్రలో సీఎస్ గా నియమితులైన మొదటి బీసీ అధికారి విజయానoదేనని, చంద్రబాబు బడుగు బలహీన వర్గాల అందరి ప్రశంసలు అందుకోవాల్సిన నాయకుడు అని యనమల అన్నారు.
Also Read: AP New CS : ఏపీ సీఎస్ గా విజయానంద్ నియామకం.. ఎవరీ విజయానంద్..
గతంలోనూ చంద్రబాబు నాయుడు షెడ్యూలు కులాలకు చెందిన కాకి మాధవరావును సీఎస్‌గా నియమించారు. ప్రస్తుతం బీసీ అధికారి అయిన విజయానంద్ ను సీఎస్ గా నియమించి బడుగు, బలహీన వర్గాల పట్ల తనకున్న నిబద్దతను మరోసారి చాటుకున్నారని యనమల రామకృష్ణుడు కొనియాడారు. యాదవ సామాజిక వర్గం నుంచి సీఎస్ అయిన మొదటి అధికారి కూడా విజయానంద్ అని, సీఎస్ గా విజయానంద్ పనితీరు వైసీపీ ప్రభుత్వ విధ్వంసం నుంచి కూటమి ప్రభుత్వ అంచనాలను అందుకునేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
Also Read: Fake IPS : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో కలకలం.. నకిలీ పోలీస్ హల్చల్..
ఏపీ ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన్ను సీఎస్ గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎష్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈనెల 31న పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయానంద్ నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. విజయానంద్ స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె. ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నిలక అధికారి(సీఈవో)గానూ పనిచేశారు. 2025 నవంబరులో విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు.