TDP Mahanadu
TDP Mahanadu: రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సిర్వం సిద్ధమైంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తరువాత.. అదికూడా కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడును దిగ్విజయం చేసేందుకు పార్టీ నాయకులు, శ్రేణులు సిద్ధమయ్యారు. తొలిసారి కపడలో మహానాడు నిర్వహిస్తుండటంతో పెద్దెత్తున ఏర్పాట్లు చేయడంతోపాటు.. కడప పట్టణంతోపాటు, మహానాడుకు పరిసర ప్రాంతాలన్నీ పార్టీ తోరణాలు, ప్లెక్సీలతో పసుపు మయంగా మారాయి.
రేపటి నుంచి (మంగళవారం) మూడు రోజులపాటు మహానాడు జరగనుంది. కపడ నగర శివార్లలో ఉన్న కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రులంతా కపడకు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం కపడకు చేరుకోనున్నారు. పార్టీ తోరణాలు, కటౌట్లు, ప్లెక్సీలతో మహానాడు ప్రాంగణం, కడప, కమలాపురం నియోజకవర్గాలు పసుపుమయమయ్యాయి.
మహానాడు వేదిక దాదాపు పూర్తయింది. మైదానంలో తొలి రెండు రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. మహానాడు ప్రాంగణం వద్దనే భోజనశాల, ముఖ్యమంత్రి సభ, ఆయన క్యాంపు కార్యాలయం ఇలా అన్నింటినీ సిద్ధం చేశారు. 450 మంది కూర్చొనే విధంగా ప్రతినిధుల సభా వేదిక ఏర్పాటు చేశారు. కింద 25వేల మంది కూర్చుని చర్చించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మహానాడు జరిగే ప్రాంతంలో వర్షం పడినా ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు రోజులు కార్యక్రమాలు ఇలా..
♦ మహానాడు మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం అవుతుంది.
♦ పార్టీ చరిత్రను వివరిస్తూ రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ప్రారంభిస్తారు.
♦ ఉదయం 10.45 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళితో మహానాడు లాంఛనంగా ప్రారంభం అవుతుంది.
♦ ఇటీవల మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంతాపం ప్రకటిస్తారు.
♦ పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగత ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత పార్టీ జమా ఖర్చులపై కోశాధికారి నివేదిక ఉంటాయి.
♦ 11.50 గంటలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసం చేస్తారు.
♦ చంద్రబాబు ప్రసంగం తరువాత పార్టీ మౌలిక సిద్ధాంతాలపై చర్చిస్తారు.
♦ లోకేశ్ రూపొందించిన.. కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగు జాతి- విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్, అన్నదాతకు అండ అనే ఆరు అంశాలను సభముందు ఉంచుతారు. నియమావళిలో సవరణలపై చర్చ జరగనుంది.
♦ మధ్యాహ్నం 1గంటకు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నోటిఫికేషన్ ఇస్తారు.
♦ భోజన విరామం అనంతరం కార్యకర్తే అదినేత, యువగళం అంశాలపైనా చర్చిస్తారు.
♦ అభివృద్ధి వికేంద్రీకరణ – వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, సాంకేతిక పరిజ్ఞానంతో పాలనను మరింత సులభతరం చేయడం , వాట్సప్ గవర్నెన్స్ పై చర్చ నిర్వహిస్తారు.
♦ రెండో రోజు (బుధవారం) ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళి అర్పిస్తారు.
♦ ఆరు సూత్రాల్లో తెలుగుజాతి – విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం – పేదల ప్రగతి, అన్నదాతకు అండ అనే అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారు.
♦ సాయంత్రం 5.30 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం, అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి.
♦ మూడో రోజు (గురువారం) మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు బహిరంగ సభ ఉంటుంది.
♦ ఈ బహిరంగ సభలో ఐదు లక్షల మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.