Balakrishna : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రిగా మీ మార్కు పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నా

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీకి చెందిన నాయకులు కూడా ఆ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు.

”ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలను నేరవేర్చాలి. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రిగా మీ మార్కు పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నా” అని ఓ ప్రకటనలో తెలిపారు బాలకృష్ణ.

Also Read : జడ్పీటీసీ మెంబర్ నుంచి చీఫ్ మినిస్టర్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ ప్రస్థానం

రేవంత్ రెడ్డి స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. 2009లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఓటుకు నోటు కేసుతో వివాదంలో చిక్కుకున్నారు. 2017లో కాంగ్రెస్ లో చేరిన ఏడాదికే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2019లో ఎంపీగా గెలిచారు. 2021లో పీసీసీ చీఫ్ అయ్యారు. కాగా.. టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం ఏంటని కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర విమర్శలు చేశారు. అయినా, అవేవీ లెక్క చేయని రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమించి పగ్గాలు చేపట్టిన రెండేళ్లకే పార్టీని అధికారంలోకి తెచ్చారు.

2018 డిసెంబర్ 4న రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తెల్లారితే పోలింగ్ ఉందనగా పోలీసులు రేవంత్ ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం విశేషం.

Also Read : రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఇదే? కాబోయే మంత్రులు వీరేనా?

రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించగానే తెలంగాణతో పాటు ఏపీలోనూ సంబరాలు కనిపించాయి. టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. తమ అధినేత చంద్రబాబు శిష్యుడు ఇప్పుడు రాష్ట్ర సీఎంగా చక్రం తిప్పనున్నారు అంటూ టీడీపీ కార్యకర్తలు ఆనందపడ్డారు. తమ పార్టీయే రేవంత్ ను నాయకుడిగా తయారు చేసిందంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి.. ఏకంగా సీఎం అవ్వడం పట్ల ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పోరాటపటిమపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు