Rammohan Naidu and Pemmasani Chandrasekhar
Narendra Modi Swearing as PM : కేంద్ర క్యాబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు మంత్రి పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరు ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ పెమ్మసానికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి మంత్రి పదవులు దక్కినట్లు సమాచారం.
Also Read : మంత్రి యోగం ఎవరికి.. కేంద్రంలో టీడీపీకి దక్కే పదవులు ఎన్ని? బాబు అడుగుతున్న శాఖలు ఏవి?
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. దీంతో వరుసగా మూడోసారి ఆయన ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేసి విజయం సాధించారు. ఆయన తొలిసారిగా లోక్ సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎంపీ గెలిచిన తొలిసారే పెమ్మసానికి కేంద్ర క్యాబినెట్ లో చోటు లభించనుంది.
Also Read : Rahul Gandhi: ఆ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ?
నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 7.15 గంటల సమయంలో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ లు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కీలక శాఖలు ఇస్తారా? నామమాత్రపు శాఖలు కేటాయిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.