Rahul Gandhi: ఆ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ?
వయానాడ్, రాయ్‌బరేలీలో ఏ స్థానానికి రాహుల్ రాజీనామా చేయబోతున్నారు? బైపోల్ వస్తే కాంగ్రెస్ నుంచి పోటీచేసే ఆ నాయకుడు ఎవరని ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ స్థానానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. యూపీలోని రాయ్‌బరేలి లోక్‌సభ సీటును కొనసాగించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఆ రెండు స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
గత రెండు టర్మ్‌లు అధికారం దక్కలేదు. ఈసారి పవర్‌లోకి రాలేదు. కానీ బీజేపీని ఓడించినంత పనిచేసింది కాంగ్రెస్. ఇండియా కూటమిగా ఎన్నికల్లోకి వెళ్లిన కాంగ్రెస్.. 2014, 2019తో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. సేమ్‌టైమ్ గత ఎన్నికల్లో ఓ చోట ఓడి..మరో చోట గెలిచిన రాహుల్ గాంధీ.. ఈసారి రెండుచోట్ల రికార్డు మెజార్టీతో గెలిచారు.
ఇప్పుడు రాహుల్ ఏ సీటును వదులుకుంటారనే చర్చ మొదలైంది. వయానాడ్, రాయ్‌బరేలీలో ఏ స్థానానికి రాహుల్ రాజీనామా చేయబోతున్నారు. బైపోల్ వస్తే కాంగ్రెస్ నుంచి పోటీచేసే ఆ నాయకుడు ఎవరని ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఒకవేళ రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే కొనసాగాలనుకుంటే రాయ్‌బరేలీ సీటుకు రాజీనామా చేయాల్సి వస్తుంది. రాయ్‌బరేలీ ఎంపీ పదవి నుంచి రాహుల్ తప్పుకుంటే ఆసీటు నుంచి ప్రియాంకాగాంధీని కాంగ్రెస్ బరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
రాయ్ బరేలీ కంచుకోట
గాంధీల కుటుంబానికి రాయ్ బరేలీ కంచుకోట. గత ఎన్నికల వరకూ కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ అక్కడి నుంచి వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ సారి అనారోగ్య కారణలతో రాయ్‌బరేలీ బరిలో నుంచి తప్పుకున్న సోనియా.. రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై పార్టీలో, గాంధీల కుటుంబంలో తీవ్రంగా చర్చ జరిగింది.
ప్రియాంక గాంధీని మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయాలని అడిగినా ఆమె నిరాకరించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీకి సిద్ధమని పరోక్షంగా సంకేతాలు పంపినా పార్టీ అధిష్ఠానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. చివరకు రాహుల్ గాంధీ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ స్థానాన్ని రాహుల్ వదులుకుంటే ఈసారి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ప్రియాంక పోటీ?
ప్రియాంక గాంధీ ఎన్నికల పోటీలోకి ఎప్పుడొస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాయి. పోటీ చేయాలని చాలా సందర్భాల్లో కోరినా ఆమె ఆసక్తి చూపలేదు. మొన్నటి ఎన్నికల్లో రాహుల్‌తో పాటు తాను కూడా బరిలో ఉంటే.. ఫ్యామిలీ పాలిటిక్స్ అని పబ్లిక్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. మోదీ, బీజేపీకి ప్రచార అస్త్రాన్ని ఇచ్చినట్లు అవుతుందని పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు ప్రియాంక. ఇప్పుడు రాహుల్ రాయ్‌బరేలీ సీటుకు రాజీనామా చేస్తే మాత్రం ప్రియాంక కచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక అన్నీ తానై వ్యవహరించారు. సోదరుడు రాహుల్ గాంధీతో జోరుగా ప్రచారం చేశారు. అమేథీ, రాయ్‌బరేలీ, వయనాడ్ సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు. గత ఎన్నికల కన్నా కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరగడంలో ప్రియాంక గాంధీ ముఖ్యపాత్ర పోషించారు.
పరిస్థితులు అనుకూలించి రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి, గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సీట్లు 100కు చేరుకుంటాయి. పదేళ్ల తర్వాత ఆ పార్టీ సీట్ల సంఖ్య మూడంకెలకు చేరే అవకాశం ఉంటుంది. అయితే వయానాడ్, రాయ్‌బరేలీలో ఏ సీటులో కొనసాగాలి..ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలనే దానిపై వారం రోజుల్లోపే రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీకి 4, తెలంగాణకు 2 పదవులు..? కేంద్ర మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కసరత్తు