TDP Senior Leaders : టీడీపీది 40 ఇయర్స్‌ పొలిటికల్‌ స్టోరీ.. పార్టీలో సీనియర్లకు చెక్!?

చాలా మంది 40 ఇయర్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ లీడర్సే... పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీనే నమ్ముకున్న లీడర్లే అంతా... అయితే 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ సూపర్‌ సీనియర్స్‌కు ఈ సారి చెక్‌ పడుతుందనే టాక్‌..

TDP Senior Leaders Situation at Present

TDP Senior Leaders : టీడీపీది 40 ఇయర్స్‌ పొలిటికల్‌ స్టోరీ… ఆ పార్టీలో ఉన్నవారిలో చాలా మంది 40 ఇయర్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ లీడర్సే… పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీనే నమ్ముకున్న లీడర్లే అంతా… అయితే 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ సూపర్‌ సీనియర్స్‌కు ఈ సారి చెక్‌ పడుతుందనే టాక్‌.. ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీడీపీలో సీనియర్‌ లీడర్లకు పరాభవం తప్పదా? ఈ సారి ఎన్నికల రణ రంగం నుంచి సూపర్‌ సీనియర్లు తప్పుకోవాల్సిందేనా? ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే… ఔనన్న సమాధానమే వినిపిస్తోంది. పరిస్థితులన్నీ సీనియర్లకు ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు తప్ప… 40 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న పెద్దలకు ఈ సారి పోటీ చేసే చాన్స్‌ దాదాపు లేనట్లేనంటున్నారు.

తొలి జాబితాలో ఇద్దరికి మాత్రమే ఛాన్స్? :
తెలుగుదేశం పార్టీది 40 ఏళ్ల చరిత్ర. 1982లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పార్టీని వదిలిపెట్టకుండా ఉన్న లీడర్లు ఎందరో ఉన్నారు. కొందరు నేతలు పార్టీని వీడినా… పొరుగు పార్టీలో ఇమడలేక మళ్లీ సొంతగూటికి చేరిపోయారు. అయితే ఇలా వెళ్లినవాళ్లు.. ప్రస్తుతం పార్టీలో ఉన్నవారు అందరూ దాదాపు 70 ఏళ్ల వయసు పైబడిన వారే కావడంతో భారంగా భావిస్తోంది పార్టీ…. ఇన్నాళ్లు ఆయా లీడర్లు త్యాగాలు చేసినా… వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే సీనియర్లను వదిలించుకుంటేనే కాని పనికాదన్న భావనకు వచ్చేసిందంటున్నారు. అందుకే తొలి జాబితాలో ఒకరిద్దరు తప్ప సీనియర్లుగా ఉన్న నేతలు ఎవరికీ సీట్లు దక్కలేదని అంటున్నారు.

Read Also : AP Capital Issue : అమరావతి వర్సెస్ వైజాగ్.. వచ్చే ఎన్నికలు రాజధానిపై ప్రజా తీర్పేనా? ఏపీలో ఏం జరగనుంది?

టీడీపీ సూపర్‌ సీనియర్లలో దాదాపు అందరూ అధినేత చంద్రబాబుతో సమానంగా రాజకీయాల్లోకి వచ్చినవారే… చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు అశోక్‌ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకటరావు, బండారు సత్యానారాయణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి,  హనుమంతరాయ చౌదరి, కేఈ ప్రభాకర్‌, లింగారెడ్డి, వరదరాజులురెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటివారు 80వ దశకంలోనే రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇక జ్యోతుల నెహ్రూ, ఆలపాటి రాజా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, కొనకళ్ల నారాయణ వంటివారు కూడా దాదాపు 30 ఏళ్లుగా టీడీపీతో కలిసి ప్రయాణం చేశారు. గంటా శ్రీనివాసరావు, కళావెంకటరావు వంటివారు మధ్యలో పీఆర్‌పీలో చేరినా… తర్వాత మళ్లీ సొంత గూటికి వచ్చారు.

మరికొందరిని తప్పించే దిశగా పార్టీ అధిష్టానం :
ఇలా టీడీపీలో కొనసాగుతున్న సీనియర్లలో ఈసారి ఒకరిద్దరికి తప్ప చాలా మందికి అవకాశం దక్కేలా కనిపించడం లేదు. యనమల రామకృష్ణుడు గత ఎన్నికల్లోనే ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోగా, అశోక్‌గజపతిరాజు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన సీనియర్లలో చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూకు మాత్రమే ఈసారి టికెట్లు దక్కాయి. మిగిలిన వారిలో కొందరికి జనసేన రూపంలో కత్తెర పడగా, మరికొందరిని తప్పించాలని భావిస్తోంది పార్టీ అధిష్టానం.

ఈ సారి అధిష్టానం హిట్‌లిస్టులో ఉన్నవారిలో కళావెంకటరావు, బండారు సత్యానారాయణమూర్తి, దేవినేని ఉమ, లింగారెడ్డి, కొనకళ్ల నారాయణ, వరదరాజుల రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కళా వెంకటరావు ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న ఎచ్చెర్ల నుంచి ఆయనను తప్పించి చీపురుపల్లిలో పోటీకి పెట్టే ప్రతిపాదన తెరపైకి తెస్తోంది టీడీపీ హైకమాండ్‌. ఇప్పటికే చీపురుపల్లి నుంచి గంటాకు పోటీచేయమన్న టీడీపీ అధిష్టానం… ఆయనను సముఖంగా లేకపోవడంతో కళా పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

ఎచ్చెర్లలో కళాకు ప్రత్యామ్నాయం ఉండటంతో ఐతే చీపురుపల్లి లేదా విజయనగరం ఎంపీగా ఆయనను బరిలోకి దింపే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోంది టీడీపీ… ఇక బుచ్చయ్య చౌదరి సీటుకు జనసేన అడ్డుగా మారింది. బుచ్చయ్యచౌదరి కోరుతున్న రాజమండ్రి రూరల్‌లో జనసేన నేత కందుల దుర్గేశ్‌ గట్టిపోటీదారుగా ఉన్నారు. దుర్గేశ్‌కు ప్రత్యామ్నాయంగా నిడదవోలు టికెట్‌ ఇస్తామంటున్నారు. అదే జరిగితే బుచ్చయ్య చౌదరికి లైన్‌క్లియర్‌ అయినట్లే… అంతవరకు బుచ్చయ్య సీటుపై సస్పెన్స్‌ కొనసాగే అవకాశం ఉంది.

గంటా కోరుకుంటున్న భీమిలి సీటు ఇస్తారా? :
ఇక కొనకళ్ల నారాయణ, లింగారెడ్డి, వరదరాజులురెడ్డి, కేఈ ప్రభాకర్‌ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నారాయణను మచిలీపట్నం ఎంపీగా పోటీకి పెట్టాలని భావించినా, ఆ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో నారాయణ రాజకీయ భవిష్యత్‌కు పుల్‌స్టాప్‌ పడినట్లేనని అంటున్నారు. ఇక లింగరెడ్డి, వరదరాజులురెడ్డికి రాజకీయంగా రెస్ట్‌ ఇచ్చే పరిస్థితే కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు, యరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమా పోటీ ఎక్కడ అనే ఉత్కంఠే కొనసాగుతోంది. గంటా కోరుకుంటున్న భీమిలి సీటు ఇస్తారా? లేక? చీపురుపల్లి వెళ్లమంటారా? అన్నది క్లారిటీ రావడం లేదు.

ఇక యరపతినేని శ్రీనివాసరావుకు గురజాల టికెట్‌ చివరి నిమిషంలో పెండింగ్‌లో పడిందంటున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరడంతో యరపతినేని విషయంలో తర్జనభర్జన పడుతోంది పార్టీ అగ్రనాయకత్వం. ఇక దేవినేని ఉమ… పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందంటున్నారు. గత ఎన్నికల్లో మైలవరంలో ఓడిపోయిన ఉమా సీటును.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తన్నుకుపోయారంటున్నారు. వసంత రాకతో ఉమా సీటు గల్లంతు అవ్వడం కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

గెలుపే టార్గెట్‌గా చంద్రబాబు.. :
ఇలా టీడీపీలో సీనియర్‌ నేతలుగా చెప్పుకున్న లీడర్లలో దాదాపు 90 శాతం మందికి సీట్లు దక్కకపోవడం అంతర్గతంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఇదే సమయంలో లోకేశ్‌ సూచనలతో దాదాపు 30 మంది కొత్తవారికి టికెట్లు ఇవ్వడం కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది. గెలుపే టార్గెట్‌గా చంద్రబాబు… కొత్తవారికి టికెట్లు ఇచ్చి, పాతవారిని పక్కనపెట్టారంటున్నారు. ఐతే దీనిపై కొన్ని విమర్శలూ వినిపిస్తున్నాయి. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ కోసం సీనియర్లను తప్పించి జూనియర్లతో లైన్‌క్లియర్‌ చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజముందో లేదో కాని సీనియర్లకు హ్యాండ్‌ ఇచ్చే వాతావరణం మాత్రం టీడీపీని కుదిపేస్తోంది.

Read Also : CM Revanth Reddy : వారికి రైతుబంధు కట్? ఎన్నికల లోపే చర్యలు, బీజేపీ బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ మ్యాచ్ ఫిక్సింగ్ – సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు