Minister Roja
Roja slams ysp leaders: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో కాల్ విషయంపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఆ వీడియో వ్యవహారంలో ఇప్పటికే సీఎం జగన్ విచారణకు ఆదేశించారని చెప్పారు. టీడీపీ నాయకులు ఆ వీడియో కాల్ నిజమో, కాదో తెలుసుకోకుండా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. వీడియో కాల్ విషయంపై జరుగుతోన్న విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఆమె అన్నారు.
మహిళలకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే జగన్ ఉపేక్షించబోరని ఆమె చెప్పారు. ఇటీవల తన కుమారుడికి కొనుగోలు చేసిన కారు విషయంలోనూ కొందరు అనవసరంగా ఆరోపణలు చేశారని ఆమె అన్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా కారును కొనుగోలు చేస్తున్నారని, అలాంటిది తాను కారు కొనుగోలు చేయడం సాధారణ విషయమని చెప్పారు.
తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తోందని, ఏ ఆరోపణలు చేయడానికి ఏమీ దొరక్క ఇటువంటి వాటిపై రాద్ధాంతం చేయాలనుకుంటున్నారని ఆమె అన్నారు. కాగా, తన నగరి నియోజకవర్గ మరమగ్గాల కార్మికుల సమస్యలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి రోజా తీసుకెళ్లారు. కాగా, గోరంట్ల మాధవ్ వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదంతా తప్పుడు ప్రచారం అంటూ గోరంట్ల వివరణ ఇచ్చుకున్నారు.