బీసీలను నమ్ముకునే స్థానిక బరిలోకి టీడీపీ!

  • Publish Date - March 10, 2020 / 12:40 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలను సైతం విడుదల చేసింది. మరోవైపు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కార్యకర్తల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అధికార పార్టీ అక్రమాలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు సీనియర్ నేతలతో కమిటీని ఏర్పాటు చేసింది. బీసీలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజం ఎత్తుతూ ఈ అంశాన్ని ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మార్చుకుంటోంది టీడీపీ. 

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవటంతో టీడీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఎన్నికల వాయిదా కోసం ప్రయత్నించిన టీడీపీ అది సాధ్యం కాకపోవడంతో ఇక సీరియస్‌గా ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు నేలతో హైలెవల్ కమిటిని చంద్రబాబు ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, లోకేష్, వర్ల రామయ్య ఈ కమిటీలో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియను పార్టీ పరంగా ఈ నేతలు సమన్వయం చేస్తారు. జిల్లా నేతలతో సంప్రదింపులు, వ్యూహాలపై ఈ కమిటీ పని చెయ్యనుంది. 

మరో ఐదుగురు ఎమ్మెల్సీలు యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, సత్యనారాయణ రాజు, దువ్వారపు రామారావుతో మరో రాష్ట్ర స్థాయి కమిటీని కూడా టీడీపీ ఏర్పాటు చేసింది. ఒక్కో ఎమ్మెల్సీకి 5 పార్లమెంటు స్థానాల చొప్పున బాధ్యతలు అప్పగించారు. వీరు ఆయా పార్లమెంట్ పరిధిలో నేతలతో టచ్‌లో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధినేతకు చేరవేస్తూ ఉంటారు. వీరంతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో అందుబాటులో ఉంటారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పర్యవేక్షణ ద్వారా ఎన్నికల్లో క్యాడర్‌కు సహకారం అందిస్తారు. పార్టీ అధినేత చంద్రబాబు కమిటీల సభ్యులతో టీడీపీ కార్యాలయంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

బీసీలకు అన్యాయంపైనే టీడీపీ ఫైట్ :    
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపైనే టీడీపీ ఫోకస్‌ చేస్తోంది. ప్రభుత్వ తప్పిదం వల్ల 16 వేల 500 మంది బీసీ ప్రతినిధులు స్థానిక సంస్థలకు రాలేకపోయారని, మొన్న వచ్చిన నోటిఫికేషన్‌లో కూడా నెల్లూరు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే బీసీలకు రిజర్వు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మిగతా జిల్లాల్లో కూడా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చారన్న అంశంపై టీడీపీ లీగల్ టీం స్టడీ చేస్తోంది. ఇప్పటికే సుప్రీం కోర్టులో రిజర్వేషన్ల అంశంపై టీడీపీ నేతలు పిటిషన్ వేశారు. పలువురు బీసీ సంఘాల నేతలతో కూడా టీడీపీ చర్చిస్తోంది.  అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకునేందుకు టీడీపీ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తే తమకు కాల్‌ చేయాలని చెబుతోంది. భయపెట్టినా.. డబ్బులు, మద్యం పంచినా వీడియో తీసి కాల్ సెంటర్‌కి పంపాలని టీడీపీ కోరుతోంది. 

ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీకి ఓటు వేయక పోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. బందరులో మంత్రి పేర్ని నాని వాలంటీర్లతో వైసీపీ ప్రచారం చేయిస్తున్నారని టీడీపీ మండిపడింది. అలాగే అధికార పార్టీ నేతలు తెలంగాణ నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారని.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను కట్టుదిట్టం చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు టీడీపీ నేతలు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక కరపత్రాన్ని కూడా టీడీపీ విడుదల చేసింది. ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ 10 అంశాలను కరపత్రంలో ముద్రించారు. బీసీ రిజర్వేషన్లు, ఇళ్ల స్థలాలు. అమరావతి, మద్యంపై జె టాక్స్, కానుకల ఎత్తివేత, నిత్యవసర సరుకుల ధరల పెంపు తదితర అంశాలను కరపత్రంలో ప్రస్తావించారు. ఈ కరపత్రాన్ని రాష్ట్రమంతా పంపిణీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. 

స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీనికోసం వారాంతంలో వెళ్లే హైదరాబాద్ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు. చంద్రబాబు రోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ క్యాడర్‌ని ఉత్సాహ పరుస్తున్నారు. క్రియాశీలకంగా లేని నేతలతో మాట్లాడుతూ వారిని సెట్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి 9 నెలలే అయినా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ స్థాయిలో కాకపోయినా కొద్దోగొప్పో ప్రభావం చూపించి పరువు కాపాడుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.