కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొడ్డిబెళగల్ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. మంత్రాలయం నియోజకవర్గం ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గతంలోనూ టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య పలు సార్లు ఘర్షణలు జరిగాయి.
గ్రామంలో ఆధిపత్యం కోసం ఇరు పార్టీల వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు జరుగుతున్నాయి. మంత్రాలయం నియోజకవర్గంలో తరుచుగా రెండు పార్టీల వర్గీయుల నడుమ ఘర్షణలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని, ఘర్షణలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకోకపోతే, ఈ ఘర్షణలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.