kanipakam
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం భక్తుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఆలయాల గురించి భక్తుల్లో ఉన్న అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా తీసుకుంటోంది.
ఈ గత నెల 20 నుంచి ప్రతి వారం సగటున 30,000 మంది భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని పలు వివరాలు తెలిపింది. భక్తుల నుంచి వసతులు, దర్శనం త్వరగా జరగడం, ప్రసాదం రుచి గురించి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పింది. ఆయా అంశాల్లో ప్రతి ప్రశ్నకు సంబంధించి ఆయా ఆలయాలకు వేర్వేరు ర్యాంకులు వచ్చాయి.
Also Read: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎలక్షన్ హామీ అమలు.. ఏప్రిల్ నుంచి..
మూడింటికి కలిపి చూస్తే కాణిపాకం ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో శ్రీకాళహస్తి, తృతీయ స్థానంలో ద్వారకా తిరుమల, ఆ తర్వాతి స్థానాల్లో విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం ఆలయాలు ఉన్నాయి.
ఆ మూడు అంశాల్లో భక్తుల నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయం గురించి మంచి అభిప్రాయాలు రావడంతో ఆ ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంలో భాగంగా దేవాలయాల్లో అందిన మౌలిక వసతులు, వాష్‌రూమ్స్, రవాణా వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారు.
ఏడు ఆలయాల్లో కలిపి దర్శనాల సమయంపై 78 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతతో పాటు రుచిపై 84 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఆలయాల్లో భక్తులు నుంచి సంతృప్తి స్థాయి 95 శాతం ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆదేశించింది.