Janasena Sabha : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ వద్ద జన సైనికులు కంట్రోల్ తప్పారు. భారీగా తరలివచ్చిన జన సైనికులు.. గోడ దూకి, బారికేడ్లు విరగ్గొట్టి సభా ప్రాంగణం వద్దకు వెళ్తున్నారు. స్టేజ్ పైకి దూసుకెళ్తున్నారు. కుర్చీలు సైతం విరగ్గొట్టారు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
జన సైనికులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసులు వారందరిని సభా ప్రాంగం నుంచి వెనక్కి పంపుతున్నారు. అన్ని వైపుల నుండి ఒకేసారి జనసైనికులు సభా ప్రాంగణం వద్దకు చొచ్చుకుని రావడంతో సభా ప్రాంగణం వద్ద ఉన్న మహిళలు ఇబ్బంది పడ్డారు.
Also Read : వారెవ్వా.. అమెరికాలో ట్రంప్, బిల్ క్లింటన్, జార్జి బుష్ సభలకు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ సభకు..
చిత్రాడలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసైనికులు తరలివచ్చారు. ఇప్పటికే అధిక సంఖ్యలో కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ.. జనసైనికులతో నిండిపోయింది.
చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. జయకేతనం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఏర్పాట్లు భారీగా చేశారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు? ఏయే అంశాలపై మాట్లాడతారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో పవన్ ప్రసంగం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
పార్టీ ఆవిర్భావ వేడుకకు వచ్చిన కార్యకర్తల కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎండలు మండిపోతుండటంతో ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా సభ కోసం 14 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇందులో 50 అడుగుల ప్రజావేదికతో పాటు వీఐపీలు, వీవీఐపీలు కూర్చునేందుకు గ్యాలరీలను సిద్ధం చేశారు.