ప్రకాశం జిల్లా మత్స్యకార గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత

  • Publish Date - December 13, 2020 / 08:26 PM IST

Tension once again in the fishing villages : ప్రకాశం జిల్లా మత్స్యకార గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రామాపురం, వాడరేవు, కఠారిపాలెం మత్స్యకారులు దాడులు, ప్రతిదాడులకు రెడీ అయ్యారు. రామాపురం వైపు కర్రలతో వాడరేవు మత్స్యకారులు బయల్దేరగా.. ప్రతిదాడి చేసేందుకు కఠారిపాలెం మత్స్యకారులు ఎదురెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. రెండు గ్రామాల్లోని పికెటింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇరువర్గాలను ఎక్కడికక్కడే అడ్డుకుని వెనక్కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బల్ల వల, ఐన వల దగ్గర మొదలైన గొడవ.. రోజు రోజుకు రాజుకుంటుండడంతో.. మత్స్యకార గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది.

చేపలు పట్టే వలలు మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టాయి. భారీ కొట్లాటకు దారి తీశాయి. ప్రకాశం జిల్లా వాడరేవులో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. వాడరేవు, కఠారిపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు మధ్య మరోసారి గొడవ తలెత్తింది. చేపల వేటకు వాడే బల్ల వలలతో మత్స్య సంపద అంతరించిపోతుందని 74 గ్రామాల ప్రజలు.. ఆ వలలు వేస్తేనే మేము బతికేదంటూ 130 గ్రామాల ప్రజలు కొట్లాటకు దిగారు. ఇరు వర్గాల గ్రామాలకు చెందిన మత్స్యకారులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రక్తాలు కారేలా కొట్టుకున్నారు. ఈ దాడిలో పది మందికి పైగా మత్స్యకారులకు తీవ్ర గాయాలయ్యాయి.

అధికారులతో చర్చలు జరుగుతుండగానే.. బల్ల వల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడం ఘర్షణకు దారి తీసింది. దీనిపై ఐల వల మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన రెండు బల్లవల మత్స్యకారుల పడవలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కఠారిపాలెం తీరప్రాంతంలోని ఫిషరీస్‌ జేడీ, మెరైన్‌ డీఎస్పీకి అప్పగించారు. దీంతో సముద్రంలోని ఐనవల మత్స్యకారులను చీరాల వాడరేవు మత్స్యకారులు అదుపులోకి తీసుకున్నారు. తమ పడవలను విడిపించే వరకు అదుపులో ఉన్నవారిని వదిలి పెట్టేది లేదని బల్లవల మత్స్యకారులు తేల్చిచెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితి కర్రలు, కత్తులతో దాడులకు దిగే వరకూ వెళ్లింది. రెండు వర్గాల యుద్ధం.. తీర ప్రాంతాన్ని రణరంగంగా మార్చేచేసింది. వాడరేవు, కఠారిపాలెం మత్స్యకారుల ఘర్షణతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామంలో 144 సెక్షన్‌ విధించి.. మరోసారి ఘర్షణలకు దిగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఫిషరీ జేడీ, చీరాల డీఎస్పీ కఠారీ పాలెం గ్రామానికి వెళ్లారు. గ్రామానికి వచ్చిన ఫిషరీ అధికారులకు.. ఐల వల ఉపయోగిస్తున్న 74 గ్రామాల మత్స్యకారులు …. బల్లవల వాడకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.