Roja and Thammineni Seetharam,
Minister Roja Selvamani: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేసిన విషయం విధితమే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా జైలులో చంద్రబాబు, రాజమండ్రిలో భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేశ్ తో పాటు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. దీనికితోడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి త్వరలో బస్సు యాత్ర చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ అంశాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also : Pawan kalyan : పవన్ కల్యాణ్ మౌన దీక్ష.. వైసీపీ ప్రభుత్వంతో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
సోమవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కాదు ఎవరైనా ఈరోజు దీక్ష చేయొచ్చు.. దీక్ష చేసే ముందు ఎంత వరకు మనకు అర్హత ఉందో చూసుకోవాలని అన్నారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర కాకపోతే హెలికాప్టర్ యాత్ర చేసుకోమనండి.. వాళ్లిష్టం అంటూ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ ఆరు నెలలు ఓపిగ్గా ఉండమని చెప్పండి.. ప్రజలు గొప్పవాళ్లు.. ఎన్నికల్లో ప్రజలు ఊహించనంత తీర్పు ఇస్తారని అన్నారు. పవన్ కల్యాణ్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ తమ్మినేని సీతారాం అన్నారు.
మంత్రి రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు, భువనేశ్వరి ఏదో త్యాగం చేసినట్లు దీక్ష చేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని, ఎన్టీఆర్ నుండి ముద్రగడ వరకు వేధించిన సంస్కృతి చంద్రబాబుది అంటూ రోజా విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షను ప్రజలు పట్టించుకోవడం లేదు.. వారికి సానుభూతి కూడా రాదని రోజా అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాల్గో విడత వారాహి యాత్ర ప్రారంభంలో భాగంగా నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ 15 సీట్లకంటే ఎక్కువరావని అన్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలకు రోజా కౌంటర్ ఇచ్చారు. వైసీపికి 15సీట్లు రావని అంటున్నారు.. పవన్ కు 15 సీట్లకైనా కనీసం అభ్యర్ధులు ఉన్నారా? అంటూ రోజా ప్రశ్నించారు. వైసీపీకి 175 స్థానాలకు అభ్యర్ధులు ఉన్నారు.. మళ్ళీ జగనే సీఎం అవుతారంటూ రోజా ధీమా వ్యక్తం చేశారు.
మహిళలను గౌరవించాల్సిన బాద్యత అందరిపైనా ఉంది. టీడీపీ నేతలు సంస్కారం లేకుండా అవమాన పరిచేలా మాట్లాడుతున్నారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి న్యాయస్థానంలో శిక్ష పడుతుందని హెచ్చరించారు.