Badvel
CPI support to the Congress : కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ పార్టీ మద్దతు ప్రకటించింది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తమ పార్టీ మద్దతిస్తున్నట్లు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ తెలిపారు. ఒకపక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని విషయాల్లో వైసీపీ మద్దతు ఇస్తోందన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో మాత్రం వైసీపీ, బీజేపీలు పరస్పరం పోటీలో ఉన్నాయని తెలిపారు. వైసీపీ, బీజేపీల దోబూచులాటలకు ఇవే నిదర్శనాలని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..రైతు, కార్మిక, ప్రజా కంటక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత, నిరంకుశ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు, విద్యుత్ ఛార్జీలు తదితరాలు ఇబ్బడిముబ్బడిగా పెంచి ప్రజలపై గుదిబండ మోపాయని విమర్శించారు.
Badwel By-Election : బద్వేల్ ఉప ఎన్నికల్లో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థను కాపాడటానికి బద్వేల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయించిందని తెలిపారు. బద్వేల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.