ఏపీలో తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవం

The first installment of 453 panchayats are unanimous : ఏపీలో తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లాలో 67, కర్నూలు జిల్లాలో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్‌ కడప జిల్లాలో 46, శ్రీకాకుళం జిల్లాలో 34 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 40 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. విశాఖ జిల్లాలో 32, తూర్పుగోదావరి జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెండో దశ నామినేషన్ల గడువు నేటితో ముగిసింది.

ఏపీలో రెండో విడత పంచాయతీ నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలో 3వేల335 పంచాయతీలు, 33వేల 632 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు 2వేల 598 సర్పంచ్, 6వేల 421 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 4వేల 760 సర్పంచ్, 19వేల 659 వార్డు స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. ఇవాళ ఆఖరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 4గంటలకు కౌంటింగ్, రాత్రిలోగా ఫలితాల వెల్లడించనున్నారు.

తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అర్హత పొందారని ఎస్‌ఈసీ ప్రకటించింది. 32 వేల 502 వార్డులకు 79 వేల 799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 77 వేల 554 నామినేషన్లు మాత్రమే సరిగ్గా ఉన్నట్టు నిర్ధారించారు. వార్డు సభ్యులకు సంబంధించి మొత్తం 2 వేల 245 నామినేషన్లను తిరస్కరించారు.