blind boy gold medals : అంధత్వం అయినా ఈతలో చిచ్చరపిడుగు…జాతీయ స్థాయిలో స్వర్ణపతకాలు

పాక్షిక అంధత్వంతో పుట్టిన బాలుడు ఈతలో పతకాల జైత్రయాత్ర సాగిస్తున్నాడు. ఏకంగా జాతీయ పతకాలను తీసుకొచ్చిన బుడతడు.. మువ్వన్నెల జెండానూ భుజాన వేసుకొని గర్వంగా దేశానికి సేవ చేస్తానని చెబుతున్నాడు.

Three gold medals for a partially blind boy : స్విమ్మింగ్‌లో మైకెల్‌ ఫెల్ప్స్‌ తెలియని వారుండరు.. బంగారు చేపగా అందరూ పిలుచుకునే ఈ అమెరికా స్విమ్మర్‌ ఒలింపిక్స్‌లో 23 వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించడం పెద్ద సంచలనం. అలాంటి ఈతల చిచ్చరపిడుగు మన జిల్లాలోనూ ఇప్పుడు పతకాల వేటను మొదలుపెట్టాడు. పాక్షిక అంధత్వంతో పుట్టిన ఆ బాలుడు కళ్లజోడు ఉపయోగిస్తే ఒక మీటరు దూరం వరకు మాత్రమే చూడగలడు. అది తీసేస్తే రెండు అడుగుల దూరం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈతలో మాత్రం తనకెవరూ సాటిరారు అంటూ పతకాల జైత్రయాత్ర సాగిస్తున్నాడు. నాలుగు నెలల శిక్షణలోనే ఏకంగా జాతీయ పతకాలను తీసుకొచ్చిన ఈ బుడతడు.. మువ్వన్నెల జెండానూ భుజాన వేసుకొని గర్వంగా దేశానికి సేవ చేస్తానని చెబుతున్నాడు.

జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అడ్వకేట్‌ గుడిగిన నాగేంద్రకుమార్‌, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు రవి కార్తీక్‌ ఏడో తరగతి చదువుతుండగా ఎర్ర కాలువలో రోయింగ్‌ శిక్షణకు వెళ్లేవాడు. 2019లో మొదలైన శిక్షణ కోచ్‌ కృష్ణమూర్తి బదిలీ అయినా సీనియర్ల సాయంతో రోయింగ్‌లో కొనసాగి, జాతీయ పోటీలకు పట్నా వెళ్లారు. అక్కడ ఏ పతకం సాధించకపోయినా నిరాశ చెందలేదు. ఆ సమయంలో రాజేష్‌ అనే కోచ్‌ ఈత నేర్చుకోవాలని సూచించడంతో పాటు ఆయనే శిక్షణ ఇచ్చారు. తర్వాత ఏలూరులోని జిల్లా శిక్షకుడు గణేశ్‌ వద్ద మెలకువలు నేర్చుకున్నాడు.

2020 నవంబరులో జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకు వచ్చి ఈత నేర్చుకుంటున్న కార్తీక్‌ అతి తక్కువ సమయంలోనే వేగంగా ఎలా ఈదాలి..? అనే అంశంపై దృష్టి సారించాడు. అశోక్‌నగర్‌లోని తమ బంధువుల ఇంట్లో ఉంటూ రోజూ ఉదయం, సాయంత్రం మూడు గంటల చొప్పున సాధన చేసేవాడు. ప్రీ స్టైల్‌, బటర్‌ ఫ్లై రెండు విభాగాల్లోనూ అద్భుత నైపుణ్యం సాధించాడు. పారా జాతీయ పోటీల ఎంపికలకు మూడు నెలల్లోనే వెళ్లేందుకు కార్తీక్‌ సిద్ధం అయ్యాడు. అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో మూడు బంగారు పతకాలు సాధించి.. గత నెల 21, 22 తేదీల్లో బెంగళూరు వేదికగా నిర్వహించిన పారా జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు.

బెంగళూరులో జరిగిన పోటీల్లో మూడు విభాగాల్లోనూ కార్తీక్‌ బంగారు పతకాలు సాధించాడు. ప్రీ స్టైల్‌ 50, 100 మీటర్లలోనూ, బటర్‌ ఫ్లై 100 మీటర్ల విభాగంలోనూ మూడు బంగారు పతకాలు తీసుకొచ్చాడు. జాతీయ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన కార్తీక్‌కు పారా ఒలింపిక్‌లో దేశం తరఫున పాల్గొనే అవకాశం రావొచ్చని, ఆ దిశగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని శిక్షకుడు గణేశ్‌ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు