Tiger cubs
Kadapa District: వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందులలో మరోసారి పులి పిల్లల కలకలం చోటు చేసుకుంది. సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామస్తులు పులి పిల్లలను చూసి హడలిపోయారు. రెండు పులి పిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని గ్రామస్థుడు నందకిషోర్ రెడ్డి తెలిపారు. తన పొలం వద్ద చీనీతోటకు నీటి తడిపెట్టేందుకు వెళ్లిన సమయంలో పులి పిల్లలు పరుగులు తీశాయని తెలిపారు. పులి పిల్లల సంచారంతో పశువులు, గొర్రెల కాపరులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పులి పిల్లలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పులివెందుల నియోజకవర్గంలో గతంలోనూ పులి పిల్లల సంచారం స్థానికులను హడలెత్తించింది. గతేడాది డిసెంబర్ నెలలో లింగాల మండలం తాతిరెడ్డిపల్లి గ్రామం సమీపంలోని పొలంలో పులి పిల్ల సంచరిస్తూ ఓ రైతు కంటపడింది. దీంతో విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా.. వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం బలపనూరు గ్రామంలో పులి పిల్లలు సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయపడుతున్నారు. పులి పిల్లలు ఉంటే పరిసర ప్రాంతాల్లోనే పులి ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి పిల్లలను పట్టుకోవటంతోపాటు పరిసర ప్రాంతాల్లో పులి సంచారం లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.