Tiger Fear Stalks Prakasam District Villages
Tiger fear stalks Prakasam district villagers : ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోలలపూడి కొండ, అద్దంకి మండలం జార్లపాలెం, కశ్యాపురం ప్రాంతాల్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాలను అప్పట్లో పరిశీలించి వెళ్లారు. ఏడాది తర్వాత తిరిగి ఇప్పుడు అద్దంకి, జె.పంగులూరు మండలాల్లోని గ్రామాల్లో చిరుత పులి అలజడి రేపింది.
రామకూరు సమీపంలోని పొలాల్లో మంగళవారం ఉదయం కొందరు రైతులు పత్తి మొక్కలు నాటుతున్నారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న చిరుత పులిని గమనించి భయంతో వణికిపోయారు. సమీపంలోని ఎన్నెస్పీ కాలువ కట్ట వద్దకు స్థానికులంతా పరుగులు తీశారు. చిరుత పులి అటువైపుగా రావడంతో భయాందోళనలకు గురైన వారంతా వాహనాలపై పలాయనం చిత్తగించారు.
సమాచారం అందుకున్న గ్రామ వీఆర్వో చిన్నఅంజయ్య.. అటవీ శాఖ అధికారి ఆంజనేయులుతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆయా ప్రదేశాలను గమనించి చిరుత పులి అడుగులుగా నిర్ధారించారు. చిరుతను బంధించేందుకు బుట్టలు, వలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు.