ఏపీలో అడుగడుగునా పోలీసులు, కేంద్ర బలగాలు.. కౌంటింగ్‌కు భారీ భద్రత ఏర్పాట్లు

144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు.

Ap Counting Security : ఓట్ల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సుదీర్ఘ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ప్రజా తీర్పు వెల్లడికానుంది. గెలిచేది ఎవరో? ఓడేది ఎవరో? తేలిపోనుంది. రేపు (జూన్ 4) ఉదయం 8గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి టేబుల్ వద్దకు ఒక ఏజెంట్ ను అనుమతించనున్నారు. అయితే ఏజెంట్ వద్ద పెన్ను, పేపర్ తప్ప ఎలాంటి వస్తువులు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈవీఎంలను సీల్ చేసే విధానం, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటుపై సూచనలు చేశారు. ఇండెక్స్ కార్డ్, మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.

ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు.

రేపటి కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని చోట్ల డ్రోన్లతో గస్తీ నిర్వహించారు. ఏపీలో పోలింగ్ రోజున, తర్వాత పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అలాంటి ఘటనలు కౌంటింగ్ రోజున జరక్కుండా ఈసీతో పాటు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది.

కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. కేంద్ర, ఏపీఎస్పీ, సీఏపీఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 144 సెక్షన్ తో ఆయా జిల్లాల ఎస్పీలు భద్రతను కట్టుదిట్టం చేశారు. మాచర్ల, తాడిపత్రి, పిఠాపురం, తిరుపతి వంటి ప్రాంతాలను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. కౌంటింగ్ రోజున అల్లర్లు, గొడవలకు పాల్పడితే జైలుకు పంపుతామని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? తుది ఫలితాలు ఇలాగే ఉంటాయా? తెలకపల్లి రవి విశ్లేషణ..