Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు..

Tirumala : ప్రస్తుతం రోజుకు సుమారు 80వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేరోజు అదనంగా వచ్చిన వారు స్వామివారి దర్శనానికి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనంకోసం వేచి ఉండే సమయం మరింత పెరుగుతోంది. ఈ కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

Tirumala Tirupati Devasthanams

Tirumala : కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి మాసం, అలాగే రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ (గురువారం), అక్టోబర్ 5వ తేదీ (సోమవారం) రెండు రోజులు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Also Read : Tirumala : తిరుమల భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. లడ్డూల కోసం కొత్త బ్యాగులు వచ్చేశాయ్! ధరలు ఎంతంటే?

ప్రస్తుతం రోజుకు సుమారు 80వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేరోజు అదనంగా వచ్చిన వారు స్వామివారి దర్శనానికి నిరీక్షించాల్సి వస్తోంది. ఇలా సుమారు 30వేల మంది భక్తులు తర్వాత రోజు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనంకోసం వేచి ఉండే సమయం మరింత పెరుగుతోంది. ఈ కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు సంబంధించి ముందురోజు అంటే.. సెప్టెంబర్ 30వ తేదీ (బుధవారం), అక్టోబర్ 4వ తేదీ (ఆదివారం) సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఇదిలాఉంటే.. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 తేదీ నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం.. ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు. ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది.

వాహన సేవల వివరాలు :
♦ అక్టోబరు 11 – అంకురార్పణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు
♦ అక్టోబరు 12 – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు
♦ పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు
♦ అక్టోబరు 13 – చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు
♦ హంస వాహనం – రాత్రి 7 గంటలకు
♦ అక్టోబరు 14 – సింహ వాహనం – ఉదయం 8 గంటలకు
♦ ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు
♦ అక్టోబరు 15 – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు
♦ సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు
♦ అక్టోబరు 16 – మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు
♦ గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు
♦ అక్టోబరు 17 – హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు
♦ పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు
♦ గజ వాహనం – రాత్రి 7 గంటలకు
♦ అక్టోబరు 18 – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు
♦ చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు
♦ అక్టోబరు 19 – స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు
♦ అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు
♦ అక్టోబరు 20 – చక్రస్నానం – ఉదయం 6 గంటలకు