తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు కరోనాతో మృతి

  • Publish Date - July 20, 2020 / 10:18 AM IST

కరోనా మహమ్మారి టీటీడీని పట్టి పీడిస్తోంది. శ్రీవారి ఆలయంలో స్వామికి సేవ చేసే అర్చకుల్లో 18 మందికి కరోనా పాజిటివ్ రాగా రెండురోజుల క్రితం పెద్ద జీయర్ స్వామికి కరోనా పాజిటివ్ రాగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ను చెన్నై అపోలోకు తరలించినట్లు సమాచారం.

తాజాగా శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు  పెద్దింటి శ్రీనివాస మూర్తి దీక్షితులు( 75 ) స్విమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం శ్వాసకోశ సమస్య ఏర్పడటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్విమ్స్ లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.

శ్రీనివాస దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 ఏళ్లకు పైగా సేవలందించారు. పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాది కాలంగా శ్రీవారి సేవలకు దూరంగా ఉంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కాగా… ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది.

టీటీడీ లో ఇప్పటివరకు 170 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు టీటీడీ లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 18 మంది అర్చకులు, 100 మంది సెక్యురిటీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 20 మంది పోటు సిబ్బంది, కల్యాణకట్టలో ఇద్దరికి కరోనా సోకినట్లుతెలిసింది.