Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్స్, టికెట్లు తీసుకున్నారా..? మీకు టీటీడీ నుంచి బిగ్ అలర్ట్..

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది.

TTD

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని పరవశించి పోతారు. అయితే, శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు వాటిలో కేటాయించిన సమయానికే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అయితే, కొందరు వారికి కేటాయించిన సమయం కంటే ముందుగానే క్యూలైన్ల వద్దకు వచ్చి తమను లోపలికి అనుమతించాలని సిబ్బందితో ఘర్షణకు దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది.

 

శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన కొంత మంది భక్తులు వారికి కేటాయించిన సమయానికి ముందే వెళ్లి క్యూలైన్ లోకి అనుమతించాలని సిబ్బందితో వాగ్వివాదానికి దిగడమే కాకుండా.. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరియైన పద్దతి కాదని టీటీడీ పేర్కొంది. టోకెన్లు, టికెట్స్ పై ఇచ్చిన సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక బుధవారం (ఫిబ్రవరి 12) శ్రీవారిని మొత్తం 70 వేల 270 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల210 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 37 లక్షల రూపాయలు వచ్చింది. గురువారం (ఫిబ్రవరి 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.