ఈయనే తిరుపతి ఎంపీ.. అందరికి అపరిచితుడే!

ఆయనో ఎంపీ.. అధికార పార్టీలో ఉన్న నాయకుడు. తిరుపతి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సమస్యలు చెప్పుకుందామని వచ్చే నియోజకవర్గ జనానికి ఈయన అసలే కనిపించడం లేదు. ఆ ఎంపీ ఎవరో మీకు తెలుసుకోవాలని ఉందా? ఆయనే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్… ఆఖరి నిమిషంలో వైసీపీ టికెట్ సాధించి విజయకేతనం ఎగురవేశారు.
ఆయన తిరుపతి వాసులకే కాదు, చిత్తూరు జిల్లా వాసులకు కూడా అపరిచిత వ్యక్తే. నిజానికి బల్లి దుర్గాప్రసాద్ నెల్లూరు జిల్లా వెంకటగిరి వాసి. సీనియర్ పొలిటీషియన్. ఇప్పుడు ఆయన తిరుపతిలో కనిపించడం లేదంటున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కూడా అందుబాటులో ఉండడం లేదంటున్నారు. ఎప్పుడో ఓసారి సీఎం జగన్ వచ్చినప్పుడు, ఎవరైనా కేంద్ర మంత్రుల పర్యటనల్లోనూ, అలా వచ్చి మెరుపులా మాయం అయ్యే దుర్గాప్రసాద్‌కు అనవసరంగా ఓటేశామనే ఉద్దేశంతో తిరుపతి జనాలు ఉన్నారంటున్నారు.
టీడీపీ టికెట్ దక్కలేదని :
వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన ఎన్టీఆర్ పిలుపందుకుని 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ తరఫున ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయిన గూడూరు నుంచి నాటి ఎన్నికల బరిలో దిగి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1994, 1999 ఎన్నికల్లోనూ వరుసగా పోటీచేసి గెలిచారు. అటు తర్వాత 2009లో మళ్లీ గూడూరు నుంచి గెలిచారు. 1989 ఎన్నికల్లో ఓసారి ఆయన ఓటమిపాలు కాగా, 2004, 2014 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. మొత్తం మీద నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దుర్గాప్రసాద్… కొంత కాలం మంత్రిగానూ పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో బాగా ఫీలైపోయి, జగన్‌ను కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకోవడమే కాదు.. తిరుపతి ఎంపి సీటు దక్కించుకొని భారీ మెజార్టీతో గెలిచారు.
ఎంపీగా గెలిచాక తిరుపతి అనే పేరునే దుర్గా ప్రసాద్ పూర్తిగా మరచిపోయారంట. జనాలకు పూర్తిగా ముఖం చాటేశారనే టాక్ నడుస్తోంది. నిజానికి ఎస్సీ రిజర్వ్ స్థానం అయిన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధి చాలా పెద్దది. ఈ నియోజకవర్గ పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, అసెంబ్లీ సెగ్మెంట్‌లతోపాటు నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. సొంత జిల్లా నెల్లూరుకే పరిమితమవుతున్న దుర్గాప్రసాద్.. ఎప్పుడైనా పొరపాటున చిత్తూరు జిల్లా గుర్తొస్తే వస్తుంటారట.
దుర్గాప్రసాద్ దర్శనభాగ్యం కష్టమే :
గడిచిన ఆరు నెలల కాలంలో రెండు మూడు సార్లు మినహా దుర్గాప్రసాద్ తిరుపతి వైపు రాలేదు. సీఎం జగన్ తిరుపతి వచ్చినప్పుడు ఎంపీ కనిపించారు. అంతకు ముందు ఒకటి రెండు మార్లు కేంద్ర మంత్రుల పర్యటనలో ప్రత్యక్షమయ్యారు. మరోసారి రైల్వే స్టేషన్ తనిఖీలకు ఆయన తిరుపతి వచ్చారు. ఎంపీ తీరుతో తిరుపతి వాసుల్లోనూ, అటు వైసీపీ క్యాడర్‌లోనూ తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. సమస్యలు చెప్పుకోవాలంటే ఆ తిరుమలేశుని దర్శనమైనా సులభంగా అవుతుంది గానీ.. దుర్గాప్రసాద్ దర్శనభాగ్యం మాత్రం కలగడం లేదని జనాలు గగ్గోలు పెడుతున్నారు. కనీసం ఆయన నియోజకవర్గ కేంద్రం తిరుపతిలో ఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.
ఓటేసిన వారి పరిస్థితి ఇలా ఉంటే.. పార్టీ కేడర్లోనూ బల్లి దుర్గాప్రసాద్ వ్యవహారంపై జోరుగా చర్చ నడుస్తోందట. ఎంపీ గారిని కలవాలంటే నెల్లూరు జిల్లాకి వెళ్లాల్సిందే అంటూ స్థానిక వైసీపీ క్యాడర్ గుసగుసలాడుతోంది. ఆఖరి నిమిషంలో పార్టీలో చేరిన ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాం… కానీ ఆయన మాకు దొరకడం లేదు… అంటూ కేడర్ ఉసూరుమంటోంది.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి, సత్యవేడు స్థానాలకు సైతం ఆయన ఒకటి రెండుసార్లు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లారని చెబుతున్నారు. బల్లి తీరుపై అంతా గుర్రుగా ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితోనూ ఆయనకు ఏవో విభేదాలు ఉన్నాయని, అందుకే ఇటు వైపు రావడం లేదని సొంత పార్టీలోనే మరో టాక్ నడుస్తోంది. మరి వీటిని చక్కబెట్టేందుకు జగన్ ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.