Tirupati gold missing
Tirupati gold missing : తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం పనుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గోపురం బంగారం తాపడం పనుల్లో అవకతవకలు జరిగాయని, 50కిలోల బంగారం మాయమైందని ఆరోపణలు వచ్చాయి. అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు గోప్యంగా విచారణ జరుపుతున్నారు.
తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వైసీపీ హయాంలో 2022-2023 మధ్య కాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం పనులు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. ఇందుకుగాను 100 కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా తొమ్మిది లేయర్లు తాపడం వేయాల్సి ఉండగా కేవలం రెండు లేయర్లే వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తద్వారా సుమారు 50కిలోల బంగారాన్ని మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
బంగారు తాపడం పనులు అసలు కాంట్రాక్టర్ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్వహించారన్న వాదన ఉంది. ఆలయ గోపురంపై అప్పట్లో 30పైగా విగ్రహాలు ధ్వంసం చేసి బంగారం తాపడం పనులు చేశారన్న విమర్శలున్నాయి. అయితే, విమాన గోపురం బంగారం తాపడం పనులపై విజెలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.