రచ్చకెక్కిన తిరువూరు టీడీపీ గ్రూప్ రాజకీయాలు.. భగ్గుమంటున్న నేతలు

ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌ ఆరోపణలను రమేశ్‌రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు.

తిరువూరు టీడీపీలో గ్రూప్ రాజకీయాలు చల్లారడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, లోకల్ టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. స్థానిక నేత రమేశ్‌ రెడ్డిపై 48గంటల్లో చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్యే అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యే బాగోతాలు బోలెడు ఉన్నాయంటూ స్థానిక పార్టీ నేతలు రచ్చకెక్కారు. తిరువూరు ఎపిసోడ్‌పై టీడీపీ హైకమాండ్‌ దృష్టిసారించింది. నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ వర్గపోరు పార్టీ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే, లోకల్ లీడర్ల మధ్య తరుచూ వివాదాలు రాజుకుంటున్నాయి. తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు, మాజీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ అలవాల రమేష్‌రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

ఓ మహిళను రమేశ్ రెడ్డి వేధించారంటూ ఎమ్మెల్యే కొలికిపూడి తీవ్ర ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా పార్టీలో తీవ్రచర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతపైనే ఎమ్మెల్యే ఆరోపణలు చేయడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ రమేశ్‌ రెడ్డి వర్గం రివార్స్ అటాక్ మొదలుపెట్టారు. ఇలా స్థానిక గ్రూప్ రాజకీయాలు తిరువూరులో నాటకీయ పరిణామాలకు తెరతీశారు.

కూటమి పొత్తులో భాగంగా అనేకమంది టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలకు, పార్టీ విధేయులకు కూడా దక్కని సువర్ణ అవకాశం కొలికపూడిని వరించింది. మొదటసారి ఎమ్మెల్యే అయిన కొలికపూడి ప్రభుత్వ కార్యక్రమాలతో కన్నా వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. నిత్యం ఎదో ఒక వివాదంతో వార్తలలో నిలుస్తూ చివరికి టీడీపీ పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. అలాగే ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు గతంలో హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు కొలికపూడి.

 అధిష్టానానికి ఆల్టిమేటం
పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టిన తర్వాత కొలికిపూడి కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపంచారు. అయితే ఇప్పుడు ఆకస్మాత్తుగా కొలికపూడి జూలు విదిల్చారు. రమేశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి ఆల్టిమేటం జారీ చేశారు. రమేశ్ రెడ్డిపై తాను ఫిర్యాదు చేసి పది రోజులు అవుతున్నా పట్టించుకోలేదని, 48 గంటల్లో రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తానని ప్రకటించి కాక రాజేశారు. ఎప్పుడూ అధిష్టానం నుంచి అక్షింతలు వేయించుకునే కొలికపూడి రివర్స్ లో పార్టీ అధిష్ఠానంపై అటాక్ చేయడం పొలిటికల్ సర్కిళ్లలో బిగ్ డిబెట్ పాయింట్‌గా మారింది.

మొత్తానికి తిరువూరు ఎపిసోడ్‌పై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. తిరువూరులో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. NTR జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్ కో ఆర్డినేటర్, విజయవాడ ఎంపీ, ముగ్గురిని కలిపి నివేదిక ఇవ్వాలని అధిష్టానం ఆదేశించింది.

ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌ ఆరోపణలను రమేశ్‌రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తనను 2 కోట్లు డిమాండ్ చేశారని ఇవ్వనందుకే కక్షగట్టారని రమేష్‌రెడ్డి చెబుతున్నారు. 3 దశాబ్దాలుగా టీడీపీ తరఫున ప్రజలకు సేవ చేసుకుంటూ బతుకుతుంటే, లేనిపోని నిందలు వేస్తూ సస్పెండ్‌ చేయించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఏదీఏమైనా తిరువూరు టీడీపీలో వర్గపోరు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై రిపోర్ట్ తీసుకున్నాక హైకమాండ్‌ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. పార్టీ ఐక్యతను కాపాడుకోవడం టీడీపీ ముందున్న ప్రధాన సవాలుగా కనిపిస్తోంది. మరి ఈ ఎపిసోడ్‌ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.