TDP Disciplinary Committee: తిరువూరు నేతల వివాదంపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందింది. చంద్రబాబుతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు, ఎంపీ కేశినేని చిన్ని వివాదంపై నివేదిక రూపొందించిన కమిటీ.. సీఎం చంద్రబాబుతో
భేటీ అయ్యింది.
కొనకొళ్ల నారాయణ, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, పలువురు నేతలు చంద్రబాబును కలిసి నివేదిక అందించారు. ఈ మధ్య ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ.. నేతల వివరణతో పాటు స్థానిక పరిస్థితులపైనా ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. నివేదికపై అధ్యయనం చేసి ఓ నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఓపెన్ గానే విమర్శలు గుప్పించుకున్నారు. ఇరువురు నేతలు మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేశారు. వీరి మధ్య వివాదం టీడీపీలో పెను దుమారమే రేపింది. దీంతో సీఎం చంద్రబాబు ఫుల్ సీరియస్ అయ్యారు. వీరి వ్యవహారంపై ఆరా తీశారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలని , దీనిపై తనకు పూర్తి నివేదిక సమర్పించాలని టీడీపీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు చంద్రబాబు.
ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగింది టీడీపీ క్రమశిక్షణ కమిటీ. వర్ల రామయ్య, కొనకొళ్ల నారాయణ, పంచుమర్తి అనురాధ నేతృత్వంలోని ఈ కమిటీ.. నేతల మధ్య వివాదంపై ఆరా తీసింది. ఇరువురి నుంచి వివరణ తీసుకుంది. తిరువూరులో స్థానిక పరిస్థితులపైనా ఆరా తీశారు. ఈ అంశంపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఆ నివేదికలో ఏముంది? అనేది ఉత్కంఠగా మారింది. నివేదిక పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు నిర్ణయం ఏ విధంగా ఉండనుంది, ఎవరిపైన చర్యలు ఉంటాయి అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కాగా, తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి ఘాటుగానే బదులిచ్చారు కేశినేని శివనాథ్. వైసీపీ కోవర్ట్ అంటూ కొలికపూడిపై ఎదురుదాడికి దిగారాయన.
Also Read: 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు