Tocilizumab Injection
Tocilizumab Injection : కరోనా సంక్షోభాన్ని సైతం సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు కేటుగాళ్లు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని బతికించే మందుల పేరుతో దందా సాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో అత్యవసర ఔషధాలను బ్లాక్ మార్కెట్ లోకి తరలించి క్యాష్ చేసుకుంటున్నారు కొందరు స్వార్థపరులు. తమ వాళ్లను రక్షించుకునేందుకు అవసరమైన డ్రగ్ ను ఎంత మొత్తానికైనా చెల్లించి కొనేందుకు సిద్ధపడుతున్న వారి అవసరాలను అలుసుగా చేసుకుని రెచ్చిపోతోంది మెడిసిన్ మాఫియా.
క్రిటికల్ కండీషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఇచ్చే టొసిలిజుమాబ్ ఇంజెక్షన్లు తమ దగ్గర ఉన్నాయంటూ బేరాలు ఆడుతున్నారు కేటుగాళ్లు. 40వేలకు దొరికే డ్రగ్ ని నాలుగున్నర లక్షలకు పైనే పెంచేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. అంత డబ్బు పెట్టి కొనేందుకు రెడీ అయితే టొసిలిజుమాబ్ లేదు అలాంటిదే వేరే డ్రగ్ ఉందని చెబుతున్నారు. క్యాన్సర్ రోగులకు వాడే డ్రగ్ ని కూడా కోవిడ్ కి వాడొచ్చని నమ్మబలుకుతున్నారు. సిజుమాబ్ అనే క్యాన్సర్ డ్రగ్ ని 3.70లక్షల రేటు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఇంజెక్షన్ ఒరిజనల్ ధర రూ.43వేలు. కేవలం ఒకటీ రెండే ఉన్నాయని వెంటనే కొనుక్కోవాలని అంటూ రూ.3.70లక్షలకు పైనే అమ్ముతున్నారు.