Balineni Srinivasa Reddy
Tota Anjaneyulu: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి మాజీ పీఏ తోటా ఆంజనేయులు, అతని భార్య పద్మజను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మద్దిపాడు పోలీస్టేషన్‌కు వారిని తరలించారు. తన స్వగ్రామం సంతనూతలపాడు మండలం ఎడ్లూరుపాడులో ఆతని తల్లి సీతమ్మ పెద్దకర్మ కార్యక్రమం ముగించుకొని ఒంగోలుకు వెళ్తుండగా ఎడ్లూరుపాడు డొంక వద్ద ఆడ్డుకొని మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సుమారు 18సంవత్సరాలపాటు తోట ఆంజనేయులు కుండా భాస్కర్ రెడ్డి పీఏగా పనిచేశారు. విశాఖపట్నంలో ఉంటూ బాస్కరెడ్డి వ్యాపార, ఇతర లావాదేవీల వ్యవహారాలు ఆంజనేయులు చక్కబెట్టారు. ఐదు నెలల క్రితం అక్కడ ఉద్యోగం మానేశాడు. ఇటీవల బాలినేనితోపాటు ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డిపై భూ అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. విశాఖపట్నంకు చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఈ ఆరోపణలు చేశారు. అతని వెనుక ఆంజనేయులు పాత్ర ఉందని భాస్కర్ రెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే విశాఖలో ఆంజనేయులుపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనను అరెస్ట్ చేయకుండా ఆంజనేయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే, ఆదివారం రాత్రి 11గంటల సమయంలో ఆంజనేయులు భార్య పద్మజను వదిలిపెట్టిన పోలీసులు.. ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసు అధికారులు ఎలాంటి సమాచారాన్ని తెలియజేయలేదు.