Tirumala Tirupati Devasthanam
Tirumala Tirupati Devasthanam: కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతీరోజూ తిరుమల కొండపైకి తండోపతండాలుగా తరలివెళ్తుంటారు ఇక పండుగలు, హిందువులకు ప్రత్యేకమైన రోజుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, 2024 సంవత్సరంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా.. తిరుమల ఆలయానికి గత ఏడాది రూ.1,367 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీ ఆదాయం ద్వారా దాదాపు రూ.1600 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. 2024-2025 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది మార్చి నెలతో ముగుస్తుంది.
నెలవారి హుండీ ఆదాయం ఇలా..
2024 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం అత్యధికంగా ఆగస్టు నెలలో రూ.125.62 కోట్లు సమకూరింది. అత్యల్పంగా ఏప్రిల్ నెలలో రూ.101కోట్లు ఆదాయం మాత్రమే సమకూరింది. నెలవారి హుండీ ఆదాయాలను ఓసారి పరిశీలిస్తే.. జనవరి -116కోట్లు, ఫిబ్రవరి- రూ.111 కోట్లు, మార్చి -రూ. 118 కోట్లు, ఏప్రిల్ – రూ.101 కోట్లు, మే – రూ.108 కోట్లు, జూన్ – రూ.113 కోట్లు, జులై రూ.125కోట్లు, ఆగస్టు -రూ. 125.62కోట్లు, సెప్టెంబర్ రూ. 114 కోట్లు, అక్టోబర్ – రూ.107 కోట్లు, నవంబర్ – రూ.111 కోట్లు, డిసెంబర్ నెలలో రూ. 115 కోట్లు హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.
ప్రతీనెల భక్తుల సంఖ్య ..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతీరోజు 60 నుంచి 70వేల మందికిపైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలో 23లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. ఫిబ్రవరి నెలలో అత్యల్పంగా 19లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నెలవారి వివరాలను పరిశీలిస్తే.. జనవరి – 21లక్షలు, ఫిబ్రవరి- 19లక్షలు, మార్చి -21 లక్షలు, ఏప్రిల్ – 20లక్షలు, మే- 23 లక్షలు, జూన్-22లక్షలు, జూలై – 22లక్షలు, ఆగస్టు -22లక్షలు, సెప్టెంబర్ -20లక్షలు, అక్టోబర్ – 21లక్షలు, నవంబర్ -20లక్షలు, డిసెంబర్ నెలలో 21లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారిని మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా.. 99లక్షల మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ పేర్కొంది. 6.30కోట్ల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా.. ఈ ఏడాది మొత్తం 12.44కోట్ల లడ్డూలు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీబీ) వెల్లడించింది.