TTD Chairman: వారి సూచనల మేరకే.. భక్తులకు కర్రల పంపిణీపై ట్రోల్స్.. స్పందించిన టీటీడీ చైర్మన్ భూమన

సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కొందరు కావాలనే టీటీడీ నిర్ణయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తిరుమల నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని భూమన అన్నారు.

TTD Chairman Bhumana Karunakar Reddy

TTD Chairman Bhumana Karunakar Reddy: తిరుమల కాలినడక మార్గంలో చిరుత పులులు భక్తులను హడలెత్తిస్తున్నాయి. గత సోమవారం కాలినడక మార్గంలో తిరుపతి కొండపైకి వెళ్తున్న ఆరేళ్ల బాలిక లక్షితను చిరుత పులి దాడిచేసి హతమార్చిన దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. చిరుత పులిని పట్టుకొనేందుకు అటవీ శాఖ అధికారులతో కలిసి తిరుమలకు కాలినడక మార్గంలో బోన్లు ఏర్పాటు చేసింది. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. మూడు రోజుల క్రితం బోనులో చిరుత పులి చిక్కింది. తాజాగా గురువారం తెల్లవారు జామున మరో చిరుత చిక్కింది.

Leopard Trapped : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత .. 50రోజుల వ్యవధిలో మూడు చిరుతలు..

టీటీడీ నిర్ణయంపై ట్రోల్స్..

తిరుమల కాలినడక దారిలో టీటీడీ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. అంతేకాక.. మున్ముందు భక్తులపై అడవి జంతువుల దాడుల ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులతో కలిసి టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 12ఏళ్లలోపు వయస్సున్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అలిపిరి మెట్ల మార్గం నుంచి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. పెద్దలను రాత్రి 10గంటల వరకు అనుమతిస్తామని తెలిపింది. దీనికితోడు కాలినడకన వెళ్లే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు చేతికర్రలు ఇచ్చే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ‘ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నారు’. ‘చిరుత పులిదాడిని కర్రతో నివారించొచ్చా’ అంటూ టీటీడీ నిర్ణయంపై ట్రోల్స్ చేస్తున్నారు.

Leopard: బాబోయ్ మరో చిరుత..! తిరుమల కాలినడక మార్గంలో ఇంకో చిరుతపులి.. ఎలుగుబంటిసైతం ప్రత్యక్షం..

టీటీడీ చైర్మన్ భూమన ఏమన్నారంటే..

సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను ఖండించారు. అటవీశాఖ అధికారుల సూచనల మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. కొందరు కావాలనే టీటీడీ నిర్ణయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తిరుమల నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని భూమన అన్నారు.
గురువారం తెల్లవారు జామున చిరుత పులి బోనులో చిక్కిన ప్రదేశాన్ని టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిరుత పులి బోనులో చిక్కిందని తెలిపారు. బోనులో చిక్కింది మగ చిరుత అని అధికారులు నిర్ధారించారని, దానికి దాదాపు ఐదేళ్ల వయస్సు ఉంటుందని భూమన చెప్పారు. భక్తులకు భద్రత కల్పిస్తూనే ఆపరేషన్ చిరుత చేపడుతున్నామని అన్నారు. చిరుత సమాచారంపై నిఘాకోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టామని చెప్పారు.