Tirumala Down Ghat Road
TTD Chairman: తిరుపతికి రావాలని అనుకుంటున్న భక్తులకు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పలు సూచనలు జారీ చేశారు. భక్తులు తమ యాత్రను 15 రోజుల పాటు వాయిదా వేసుకోవాలన్నారు. ఎందుకంటే..ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడుతున్నాయని తెలిపారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వేకువజామున 5.45 గంటలకు భారీగా కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో…తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు వెళుతోంది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు. 2021, డిసెంబర్ 01వ తేదీ బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయని, అదృష్టవశాత్తు స్వామివారి కృపతో భక్తులకు ఎవరికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.
Read More : CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన
రోడ్డు మొత్తం నాలుగు ప్రాంతాల్లో భారీగా దెబ్బతిన్నదని, ఘాట్ రోడ్డు పూర్తిగా మరమ్మతులు చేయాలంటే రెండు మూడు రోజులు పడుతుందన్నారు. ఈ క్రమంలో…భక్తులు తమ యాత్రను 15 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న టికెట్లకు రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని సూచించారు. ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకుంటామని, ఘాట్ రోడ్డు అధ్యయనం కోసం ఢిల్లీ నుండి ఐఐటి నిపుణులను ఆహ్వానిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి. ఇటీవలే తిరుమలలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.కనివీని ఎరుగని రీతిలో వర్షం పడడంతో తిరుపతి నగరం జలదిగ్భందం అయ్యింది. రహదారులు చెరువులను తలపించాయి.
Read More : Hyderabad : సెల్ఫీ తీసుకుని స్కూటర్ స్టార్ట్ చేసుకోవచ్చు
ఇక ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతుండడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొన్ని రోజులు ఘాట్ రోడ్డును మూసివేశారు. కొండచరియలు విరిగిపడకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే ఐఐటీ నిపుణులు ఘాట్ రోడ్డును పరిశీలించారు. టీటీడీ అధికారులకు వారు నివేదిక అందచేయనున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే కొనసాగుతున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత…రాయలచెరువు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుందంటే..వర్షం ఏ స్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు. మరో రెండు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.