TTD : టీటీడీపై అసత్యాల ప్రచారం మానుకోవాలి.. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై పాలక మండలి సభ్యుల ధ్వజం

TTD : వైసీపీ నేత, మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై టీటీడీ పాలక మండలి సభ్యులు ధ్వజమెత్తారు. ఆయన అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TTD : వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తీరుపై టీటీడీ పాలక మండలి సభ్యులు ధ్వజమెత్తారు. అలిపిరి వద్ద విష్ణుమూర్తి విగ్రహాన్ని పట్టించుకోవడంలేదని కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి, ఎంఎస్ రాజు, శాంతారాం, నరేష్‌లు ఖండించారు. టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బోర్డు సభ్యులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

Also Read: సర్వ శుభాలు చేకూర్చే సర్వమంగళా దేవి.. ఈ పీఠం విశిష్టత ఇదే..

కరుణాకర్ రెడ్డి రాజకీయ నిరుద్యోగి. ఆబద్ధపు ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్లి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. మహా విష్ణువు విగ్రహానికి, శనీశ్వరుని విగ్రహానికి నీకు తేడా తెలియదా..? అంటూ ప్రశ్నించారు. ఆయన చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉంది. శిల్ప క్వార్టర్స్ ఆ ప్రాంతంలోనే ఉండేది.

20సంవత్సరాల క్రితం కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి శనేశ్వర విగ్రహం తయారీకి ఆర్డర్ ఇచ్చారు. శనీశ్వరుడి విగ్రహానికి కాకి బదులుగా మరో అవతారం రావడంతో దాన్ని అక్కడే వదిలేశారు. ఇప్పుడు ఆ విగ్రహం మహావిష్ణువుదని, అపచారం జరిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. రాత్రి మద్యం బాటిళ్లు అక్కడ పెట్టి ఫ్రీ ప్లాన్‌గా చేశారు. దీనిపై అందరితో చర్చించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాం. మీరు చేస్తున్న దుష్ప్రచారంపై ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారని పాలక మండలి సభ్యులు హెచ్చరించారు.

అసత్యాలు, అబద్ధాలతో టీటీడీపై బురద చల్లే కార్యక్రమం మంచిది కాదు. టీటీడీపై అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలి. టీటీడీపై మాట్లాడితే సంచలనం అవుతుందని అసత్యాలు మాట్లాడుతున్నారు. ఇటువంటివి పునరావృతం అయితే సహించేది లేదని పాలక మండలి సభ్యులు హెచ్చరించారు.

ఇంట్లో ఒక మతం ఆచరించి డబ్బుకోసం హిందుత్వం ఆచరించే వ్యక్తి కరుణాకర్ రెడ్డి. శ్రీవారి ఆలయంలో రాముల వారికి జరిగిన అపచారం నువ్వు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాములు వారికి విరిగిన వేలు సరిచేసి సంప్రోక్షణ చేశామని టీటీడీ పాలక మండలి సభ్యులు అన్నారు.